WI Vs Pak: పాక్‌ జట్టును డీగ్రేడ్‌ చేయడమే.. అసలు ఏంటిది?!

27 Jul, 2021 21:12 IST|Sakshi

ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ ఫైర్‌

Pakistan Tour Of West Indies 2021: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ మండిపడ్డాడు. వెస్టిండీస్‌ బోర్డు ప్రతిపాదనలకు అంగీకరించి, మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను నాలుగు మ్యాచ్‌లకు కుదించడం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టును తక్కువ చేసి చూపడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్‌ జట్టు టీ20 సిరీస్‌ నిమిత్తం వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంది. మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను రద్దు చేసి... బుధవారం నుంచి రీషెడ్యూల్‌ చేశారు. 

కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన వెస్టిండీస్‌- ఆస్ట్రేలియా(విండీస్‌ టూర్‌) వన్డే మ్యాచ్‌ను నిర్వహించడానికే విండీస్‌ బోర్డు ఈ మేరకు పీసీబీ వద్ద ప్రతిపాదనలు చేసింది. ఇందుకు పాక్‌ బోర్డు అంగీకరించడంతో పాకిస్తాన్‌తో ఆడాల్సిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4 మ్యాచ్‌లకు పరిమితం చేసింది. ఈ విషయంపై స్పందించిన ఇంజమామ్‌.. ‘‘అసలు పీసీబీ ఇలాంటి ఒక ప్రపోజల్‌కు ఎందుకు అంగీకరించిందో అర్థం కావడం లేదు. కరోనా కేసు వెలుగు చూసిన కారణంగా విండీస్‌- ఆసీస్‌ మ్యాచ్‌ రీషెడ్యూల్‌ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే... దీనితో పాక్‌ టీ20 సిరీస్‌కు ఏం సంబంధం? 

నిజానికి టీ20 సిరీస్‌కు, ఆగష్టు 12న ప్రారంభం కావాలిస్న టెస్టు సిరీస్‌కు మధ్య మధ్య తొమ్మిది రోజుల వ్యవధి ఉంది. కావాలంటే ఈ గ్యాప్‌లో మరో మ్యాచ్‌ నిర్వహించవచ్చు. కానీ, ఆస్ట్రేలియా కోసం విండీస్‌ పాక్‌ మ్యాచ్‌ను రద్దు చేయాలని భావించింది. ఇది నిజంగా పాక్‌ జట్టును డీగ్రేడ్‌ చేయడమే. పీసీబీ ఎందుకు సానుకూలంగా స్పందించిందో నాకింకా షాకింగ్‌గానే ఉంది.

ఈసారి ఈ జట్టుతో లేదంటే ఆ జట్టుతో అని పదేపదే జట్లు మార్చడానికి.. ఇవేమీ క్లబ్‌ మ్యాచ్‌లు కాదు కదా. అంతర్జాతీయ మ్యాచ్‌లు’’ అని తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పీసీబీ, విండీస్‌ బోర్డు తీరును విమర్శించాడు. కాగా టాస్‌ వేసిన తర్వాత వెస్టిండీస్ జట్టు సిబ్బందిలో ఒక‌రు కరోనా బారిన పడినట్లు తెలియడంతో విండీస్‌- ఆసీస్‌ మధ్య జరగాల్సిన రెండో వన్డేను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు