WI VS ZIM 1st Test: టెస్ట్‌ల్లో తొలి సెంచరీ బాదిన చంద్రపాల్‌ తనయుడు

5 Feb, 2023 21:56 IST|Sakshi

వెస్టిండీస్‌ యువ క్రికెటర్‌ టగెనరైన్‌ చంద్రపాల్‌ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తండ్రి శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ను పుత్రోత్సాహంతో పరవశించేలా చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ బాదిన టగెనరైన్‌.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. బ్యాటింగ్‌ శైలితో పాటు హావభావలు సైతం తండ్రిలాగే ప్రదర్శించే టగెనరైన్‌.. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంలోనూ, పరుగులు సాధించడంలోనూ తండ్రికి సరిసాటి అనిపించుకుంటున్నాడు.

జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 221 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్‌ చంద్రపాల్‌ (291 బంతుల్లో 101 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (246 బంతుల్లో 116 నాటౌట్‌; 7 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. జింబాబ్వే బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించినా వీరిద్దరిని ఔట్‌ చేసుకోలేకపోయారు. ముఖ్యంగా టగెనరైన్‌ వికెట్ల ముందు గోడలా నిలబడి, బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.

టగెనరైన్‌ సెంచరీ సాధించడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. 26 ఏళ్ల టగెనరైన్‌ 3 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 65.25 సగటున 261 పరుగులు చేశాడు. టగెనరైన్‌ తండ్రి శివ్‌నరైన్‌ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్‌ అనిపించుకున్నాడు.

ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు వెస్టిండీస్‌ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం అంతరాయం నడుమ తొలి టెస్ట్‌ ఆటంకాలతో సాగుతోంది.   

>
మరిన్ని వార్తలు