WI VS ZIM 1st Test: చరిత్ర సృష్టించిన తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌.. తండ్రిని మించిపోయాడు..!

6 Feb, 2023 18:42 IST|Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో వెస్టిండీస్‌ యువ ఓపెనర్‌ తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌, తన తండ్రి శివ్‌నరైన్‌ చంద్రపాల్‌తో కలిసి ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలో తేజ్‌నరైన్‌ తన తండ్రిని కూడా వెనక్కునెట్టాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తేజ్‌నరైన్‌ అజేయ డబుల్‌ సెంచరీ (467 బంతుల్లో 207 నాటౌట్‌; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు.

కెరీర్‌లో మూడో టెస్ట్‌లోనే డబుల్‌ సెంచరీ సాధించిన తేజ్‌.. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ విభాగంలో తండ్రి శివ్‌నరైన్‌నే మించిపోయాడు. శివ్‌నరైన్‌ 164 టెస్ట్‌ల కెరీర్‌లో 203 నాటౌట్‌ అత్యధిక స్కోర్‌ కాగా.. తేజ్‌ తన మూడో టెస్ట్‌లో తండ్రి అత్యధిక స్కోర్‌ను అధిగమించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల జోడీ క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఓ యూనిక్‌ రికార్డును సొంతం చేసుకుంది.

టెస్ట్‌ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీలు సాధించిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా శివ్‌-తేజ్‌ జోడీ రికార్డుల్లోకెక్కింది. క్రికెట్‌ చరిత్రలో ఏ తండ్రి కొడుకులు ఈ ఘనత సాధించలేదు. భారత్‌కు చెందిన తండ్రి కొడుకులు లాలా అమర్నాథ్‌-మొహిందర్‌ అమర్నాథ్‌, విజయ్‌ మంజ్రేకర్‌-సంజయ్‌ మంజ్రేకర్‌, ఇఫ్తికార్‌ (ఇంగ్లండ్‌)-మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ టెస్ట్‌ల్లో సెంచరీలు చేసినప్పటికీ తండ్రి కొడుకులు ఇద్దరూ డబుల్‌ సెంచరీలు మాత్రం సాధించలేకపోయారు.

తేజ్‌నరైన్‌ కెరీర్‌లో 5 ఇన్నింగ్స్‌లు ఆడి హాఫ్‌ సెంచరీ, సెంచరీ, డబుల్‌ సెంచరీ సాయంతో 91.75 సగటున 367 పరుగులు చేశాడు. మరోపక్క తేజ్‌ తండ్రి శివ్‌నరైన్‌ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్‌ అనిపించుకున్నాడు. 

ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విండీస్‌ టీమ్‌.. తొలి టెస్ట్‌లో 447/6 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తేజ్‌నరైన్‌తో పాటు కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (182) సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే.. 11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. 

మరిన్ని వార్తలు