The Hundred League: ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ విధ్వంసం.. ఫాస్టెస్‌ సెంచరీ నమోదు

15 Aug, 2022 12:20 IST|Sakshi

ద హండ్రెడ్‌ లీగ్‌ 2022లో స్థానిక ఇంగ్లీష్‌ యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. లీగ్‌ రెండో ఎడిషన్‌లో శతకాల మోత మోగిస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఆగస్ట్‌ 10న సథరన్‌ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌కు చెందిన 20 ఏళ్ల ఓపెనింగ్‌ బ్యాటర్‌ విల్‌ స్మీడ్‌ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్‌లో తొట్ట తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోక్కెగా.. తాజాగా అదే ప్రత్యర్ధిపై ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌కు చెం‍దిన 23 ఏళ్ల యువ ఓపెనర్‌ విల్‌ జాక్స్‌ ఏకంగా 47 బంతుల్లోనే శతక్కొట్టి ఔరా అనిపించాడు. 

జాక్స్‌ మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు సాధించి తన జట్టును మరో 18 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. జాక్స్‌ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తమ జట్టుకు మరో విధ్వంసకర బ్యాటర్‌ దొరికాడని ఇంగ్లీష్‌ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జాక్స్‌ 2019లో జరిగిన ఓ టీ10 లీగ్‌లో 25 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. 

ఆదివారం (ఆగస్ట్‌ 14) సథరన్‌ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ ప్రత్యర్ధిని 137 పరుగులకే (100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మార్కస్‌ స్టోయినిస్‌ (27 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రీస్‌ టాప్లే 20 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి సథరన్‌ బ్రేవ్‌ పతనాన్ని శాసించాడు. 

అనంతరం నామమత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్‌.. జాక్స్‌ విధ్వంసం ధాటికి 82 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జాక్స్‌ ఒక్కడే అన్నీ తానై తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. జాక్స్‌ 48 బంతుల్లో 108 పరుగులు సాధిస్తే.. బ్యాటింగ్‌ అవకాశం వచ్చిన మిగతా నలుగురు 35 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేసి తుస్సుమనిపించారు. 

ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ లీగ్‌లో మూడోసారి డకౌట్‌ కాగా, రిలీ రుస్సో (13 బంతుల్లో 10; సిక్స్‌), కెప్టెన్‌ సామ్‌ బిలింగ్స్‌ (8) దారుణంగా నిరాశపరిచారు. జాక్స్‌ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు ప్రస్తుత ఎడిషన్‌లో మూడో విజయాన్ని (4 మ్యాచ్‌ల్లో) అందించాడు. తాజా ఓటమితో డిఫెండింగ్‌ ఛాంనియన్‌ సథరన్‌ బ్రేవ్‌ పరాజయాల సంఖ్య మూడుకు (4 మ్యాచ్‌ల్లో) చేరింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో లండన్‌ స్పిరిట్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 
చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌.. హండ్రెడ్‌ లీగ్‌లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు

మరిన్ని వార్తలు