Lionel Messi: 'మెస్సీ ఆటను ఎంజాయ్‌ చేస్తున్నాం.. చర్చ అవసరమా?'

13 Dec, 2022 12:18 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో లియోనల్‌ మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను సెమీస్‌కు చేర్చాడు. ఇప్పటివరకు నాలుగు గోల్స్‌ కొట్టిన మెస్సీ.. కీలక సెమీఫైనల్లో ఏం చేస్తాడో చూడాలి. 35 ఏళ్ల మెస్సీకి ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్‌ అని భావిస్తున్న తరుణంలో ఎలాగైనా టైటిల్‌ అందుకోవాలని అర్జెంటీనా ఉవ్విళ్లూరుతుంది. ఇవాళ క్రొయేషియాతో జరిగే సెమీఫైనల్లో ఓడితే మాత్రం అర్జెంటీనాతో పాటు మెస్సీ కథ కూడా ముగిసినట్లే. ఈ నేపథ్యంలో క్రొయేషియాపై మెస్సీ బృందం ఎలాగైనా గెలవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

ఇక ఫిఫా వరల్డ్‌కప్‌ అనంతరం మెస్సీ ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగు 35 ఏ‍ళ్లు వచ్చాయి కాబట్టి ఇక మెస్సీ తర్వాతి ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే అర్జెంటీనా కోచ్‌ లియోనల్‌ స్కలోని మాత్రం మెస్సీ రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''ఫిఫా వరల్డ్‌కప్‌ తర్వాత మెస్సీ కొనసాగుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. కానీ ఈ క్షణంలో మాత్రం మెస్సీ ఆటను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాం. సంతోషంగా ఉన్న సమయంలో మెస్సీ రిటైర్‌మెంట్‌పై అనవసర చర్చ ఎందుకు చెప్పండి. ప్రస్తుతం మెస్సీ అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌ను మెస్సీ బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు.. అతని ఆటను చూసి మనం కూడా ఎంజాయ్‌ చేద్దాం. అర్జెంటీనా విజేతగా నిలిస్తే చూడాలని మెస్సీ కలలు కంటున్నాడు. ఆ కల నిజం అవ్వాలని కోరుకుందాం.'' అంటూ ముగించాడు.

చదవండి: Cristiano Ronaldo: కోచ్‌ కాదు.. నోటి ‍మాటలే శాపంగా మారాయా?

మరిన్ని వార్తలు