సీఎస్‌కే కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్.. మరి ధోని!?

5 Mar, 2023 10:44 IST|Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఇక ఈ సీజన్ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి చివరిది కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ధోని నేరుగా ప్రస్తావించనప్పటికి పరిస్థితి మాత్రం అలానే కనిపిస్తోంది. అయితే ధోనికి ఐపీఎల్‌ 15వ సీజన్‌ చివరిదని భావిస్తున్న అభిమానులకు మరొక షాకింగ్‌ న్యూస్‌.

ధోని ఈ సీజన్‌లో కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగాలనుకుంటున్నట్లు సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలను వేరొకరికి అప్పజెప్పాలని ధోని అనుకుంటున్నాడు. మరి ధోని ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడో తెలుసా.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌. ప్రస్తుతం స్టోక్స్‌ ఇంగ్లండ్‌కు టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని సారధ్యంలో ఇంగ్లీష్‌ జట్టుకు ఎదురులేకుండా పోయింది. దూకుడైన నిర్ణయాలు తీసుకుంటూ సంచలన విజయాలు సాధిస్తుంది.

గతేడాది జరిగిన వేలంలో స్టోక్స్‌కు భారీ ధర పలికింది. అత‌డిని ద‌క్కించుకునేందుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.16.25 కోట్ల‌కు సీఎస్కే ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ను కొనుగోలు చేసింది. అయితే స్టోక్స్‌ ఐర్లాండ్‌తో టెస్టు, యాషెస్‌ సిరీస్‌ కోసం టోర్నీ మధ్యలోనే వైదొలుగుతానని గతంలోనే పేర్కొన్నాడు.

కానీ మనసు మార్చుకున్న స్టోక్స్‌ తాను ఐపీఎల్‌ 16వ సీజన్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ధోని తన మనసులోని మాటను బయటపెట్టినట్లు సమాచారం. స్టోక్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని.. తాను ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానంటూ సీఎస్‌కేకు వెల్లడించినట్లు తెలిసింది. ధోని నిర్ణయాన్ని సీఎస్‌కే ఏకీభవించాల్సిందే. ఎందుకంటే ధోని ముందు నుంచి సీఎస్‌కేలోనే కొనసాగుతున్నాడు. జట్టును నాలుగుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపాడు.

గతేడాది కూడా ధోని కెప్టెన్‌ బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆల్‌రౌండర్‌ జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే జడ్డూ కెప్టెన్సీ ఒత్తిడిలో పడిపోయి ఆటపై దృష్టి పెట్టలేకపోయాడు. దీనికి తోడు సీఎస్‌కేను వరుస ఓటములు పలకరించాయి. దీంతో జడేజా సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే మరోసారి ధోనినే ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న ధోని కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. 

అయితే ఈసారి మాత్రం తాను ఆటగాడిగా మాత్రమే కొనసాగాలనుకుంటున్నాడు. బహుశా ఆఖరి సీజన్‌ అని ధోని భావిస్తున్నాడు కాబట్టే బ్యాటర్‌గా రాణించాలనుకుంటున్నాడని అభిమానులు పేర్కొన్నారు. అయితే ధోనికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చిన సీఎస్‌కే ఒక కండీషన్‌ పెట్టింది. ఒకవేళ సీఎస్‌కే ఫైనల్‌ చేరిన తర్వాత స్టోక్స్‌ స్వదేశానికి వెళ్లిపోతే జట్టును నడపించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ధోని కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ధోని కెప్టెన్‌గా కొనసాగుతాడా లేక కేవలం ఆటగాడిగానా అనేది ఐపీఎల్‌ ప్రారంభమయితే కానీ తెలియదు. 

చదవండి: ఫ్రాన్స్‌ స్టార్‌ ఎంబాపె కొత్త చరిత్ర..

ధోని సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు