త్యాగి బౌన్సర్‌.. కుప్పకూలిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌

9 Dec, 2020 13:53 IST|Sakshi

సిడ్నీ : ఆసీస్‌ క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూజ్‌ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2014లో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా సీన్‌ అబాట్‌ వేసిన బౌన్సర్‌ హ్యూజ్‌ మెడకు బలంగా తగిలింది. దీంతో అతను మైదానంలోనే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయాడు. అలా మూడు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. హ్యూజ్‌ మరణవార్త ఆసీస్‌ క్రికెట్‌ చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోయింది. అప్పటినుంచి ఎక్కడో ఒక చోట ఇలా బౌన్సర్లు బ్యాట్స్‌మన్ల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎవరైనా ఒక బ్యాట్స్‌మెన్‌ బంతి వల్ల గాయపడితే అదే భయం వెంటాడుతుంది. (చదవండి : టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు)


తాజాగా సిడ్నీ వేదికగా ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరిగింది. కాగా బుధవారం ఆటలో చివరి రోజులో భాగంగా ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతుంది.  ఓపెనర్‌ విన్‌ పుకోవిస్కి 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ను ఇండియా- ఏ బౌలర్‌ కార్తిక్‌ త్యాగి వేశాడు. త్యాగి వేసిన తొలి బంతి బౌన్స్‌ అయి పుకోవిస్కి హెల్మెట్‌ బాగాన్ని బలంగా తాకింది. బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఒత్తిడికి లోనైన పుకోవిస్కి క్రీజులోనే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తోటి ఆటగాళ్లు అతన్ని దగ్గరికి వచ్చి లేపడానికి ప్రయత్నించారు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు')

వెంటనే ఫిజియో వచ్చి పుకోవిస్కిని పరిశీలించి పరీక్ష చేస్తే గాయం పరిస్థితి ఎంటనేది తెలుస్తుందని పేర్కొన్నాడు.దీంతో పుకోవిస్కి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.అయితే పుకోవిస్కి గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు అతను ఆడేది అనుమానంగానే ఉంది. దేశవాలి క్రికెట్‌లో యంగ్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విన్‌ పుకోవిస్కి టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. (చదవండి : ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా)

మరిన్ని వార్తలు