IND Vs NZ ODI Series: తొలి వన్డేకు వర్షం ముప్పు.. వరుణుడి కోసమే సిరీస్‌ పెట్టినట్లుంది

24 Nov, 2022 16:40 IST|Sakshi

టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న సిరీస్‌లో వరుణుడు శాంతించేలా కనిపించడం లేదు. తాజాగా నవంబర్‌ 25న(శుక్రవారం) ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా ఆక్లాండ్‌లో వర్షం కురుస్తున్నప్పటికి రెండు రోజులుగా చూసుకుంటే వాతావరణంలో కాస్త మార్పు కనపించింది.

మ్యాచ్‌ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. మ్యాచ్‌ సమయానికి 20 శాతం మాత్రమే వర్షం పడే చాన్స్‌ ఉందని.. గాలిలో 62 శాతం తేమ ఉంటుందని.. గంటకు 32 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు.. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. 

ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ మాత్రమే పూర్తి స్థాయిలో జరిగింది. వర్షంతో తొలి టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో టి20లో మాత్రం టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఇక మూడో టి20లో కివీస్‌ ఇన్నింగ్స్‌ అనంతరం వరుణుడు అడ్డు తగలడం.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో మ్యాచ్‌ టై అయినట్లు ప్రకటించడంతో 1-0తో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది.

అయితే టీమిండియా కివీస్‌ టూర్‌ఫై మాత్రం భారత అభిమానులు సంతృప్తిగా లేరు. అసలు టీమిండియా సిరీస్‌ ఆడడానికి వెళ్లినట్లుగా అనిపించడం లేదని వాపోయారు. టి20, వన్డే సిరీస్‌లు టీమిండియా, కివీస్‌లు ఆడేందుకు కాకుండా వరుణుడి కోసమే ఏర్పాటు చేసినట్లుగా అనిపిస్తుందని కామెంట్స్‌ చేశారు.

ఇక టి20లకు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ చేపట్టగా.. వన్డేలకు మాత్రం శిఖర్‌ ధావన్‌ తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే రోహిత్‌ గైర్హాజరీలో పలుసార్లు జట్టును నడపించిన ధావన్‌ ప్రతీసారి సక్సెస్‌ అవడమే గాక బ్యాట్స్‌మన్‌గానూ సత్తా చాటుతున్నాడు. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌ను కూడా నెగ్గి రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో తన స్థానం మరింత సుస్థిరం చేసుకోవాలని ధావన్‌ చూస్తున్నాడు.

చదవండి: చాలా ఊహించుకున్నా.. హార్ధిక్‌ రీ ఎంట్రీతో ఆశలన్నీ అడియాశలయ్యాయి..!

>
మరిన్ని వార్తలు