అప్పుడూ ఇదే సీన్‌.. మరి టీమిండియా గెలిచేనా?

9 Jan, 2021 11:13 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 338 పరుగులకు ఆలౌటైతే, టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌ను 244 పరుగులకు ముగించింది. ఇక్కడ ఇరు జట్ల తమ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాయి. ఆసీస్‌ నాలుగు వంద పరుగుల్ని సునాయాసంగా చేస్తుందని భావిస్తే వారిని టీమిండియా కట్టడి చేసింది. ఇక భారత్‌ జట్టు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరును అధిగమిస్తుందని అనుకుంటే అదీ జరగలేదు. ఇన్ని మలుపులు చూస్తుంటే ఈ మ్యాచ్‌లో ఫలితం వచ్చేలా కనబడుతోంది. ఓ దశలో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటే, మరొక దశలో బౌలింగ్‌కు ఈ పిచ్‌ అనుకూలంగా మారుతోంది. ఇంకా మూడో రోజు ఆటే సాగుతుంది కాబట్టి మ్యాచ్‌లో విజయం ఖాయం కనబడుతోంది. కానీ విజయం ఎవర్ని వరిస్తుందనే విషయంలో ఇంకా అంచనాకు రాలేక పోతున్నాం. 

అప్పుడూ ఇదే సీన్‌..
2008-09సీజన్‌లో భాగంగా స్వదేశంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వాకా స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌.. ప్రస్తుత మ్యాచ్‌ ను తలపిస్తోంది. అప్పుడు దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పుడు కూడా ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి, మొదటి ఇన్నింగ్సలో ఆధిక్యం సాధించడం. అది కూడా 94 పరుగుల ఆధిక్యాన్ని ఆసీస్‌ సాధించగా, చివరకు ఆసీస్‌ ఓటమి పాలైంది.  ఆనాటి మ్యాచ్‌లో ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో‌  319 పరుగులకే ఆలౌట్‌ కాగా, దక్షిణాఫ్రికాకు 415 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దీన్ని సఫారీలు సాధించారు. గ్రేమ్‌ స్మిత్‌, డివిలియర్స్‌లు సెంచరీలు బాదగా,  ఆమ్లా, కల్లిస్‌, డుమినీలు హాఫ్‌ సెంచరీలతో మ్యాచ్‌ను గెలిపించారు. మరి తాజా మ్యాచ్‌లో ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేయడమే కాకుండా 94 పరుగుల ఆధిక్యాన్నే సాధించడంతో టీమిండియా విజయం సాధించి ఆసీస్‌కు షాక్‌ ఇస్తుందో లేదో చూడాలి. ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విల్‌ పకోవిస్కీ(10), డేవిడ్‌ వార్నర్‌(13)లు విఫలమయ్యారు. పకోవిస్కీని సిరాజ్‌ ఔట్‌ చేయగా, వార్నర్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. 

మరిన్ని వార్తలు