Wimbledon 2021: ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం

10 Jul, 2021 21:07 IST|Sakshi

లండన్‌: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ వింబుల్డన్‌ చరిత్రలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి, వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో బార్టీ 6-3, 6-7(4/7), 6-3 తేడాతో కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇది బార్టీకి తొలి వింబుల్డన్‌ టైటిల్‌ కాగా, రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. అంతకుముందు 2019ఫ్రెంచ్‌ ఓపెన్‌లో బార్టీ విజేతగా అవతరించగా, ఆ తర్వాత ఇదే ఆమెకు తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.

వింబుల్డన్‌ గ్రాండ్‌ స్లామ్‌ పోరులో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన బార్టీ అంచనాలు తగ్గట్టు ఆడుతూ టైటిల్‌ను సాధించింది.  తుదిపోరులో తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన బార్టీకి రెండో సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేకర్‌కు దారి తీసిన రెండో సెట్‌ను ప్లిస్కోవా దక్కించుకోగా, టైటిల్‌ నిర్ణయాత్మక మూడో సెట్‌లో బార్టీ మళ్లీ విజృంభించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకండా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని తొలి వింబుల్డన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 1980 తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా వింబుల్డన్‌ టైటిల్‌ను గెలవక పోగా, ఆ రికార్డును బార్టీ 41 ఏళ్ల తర్వాత బ్రేక్‌ చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు