Wimbledon 2021: పురుషుల డబుల్స్ విన్నిర్ నికోలా మెక్టిక్-మేట్ పావిక్ జోడీ

11 Jul, 2021 17:51 IST|Sakshi

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్​, మేట్​ పావిక్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఈ క్రొయేషియా ద్వయం 6-4, 7-6(5), 2-6, 7-5తో మార్సెల్​ గ్రానోల్లర్స్​(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై విజయం సాధించింది. దీంతో వింబుల్డన్​ టైటిల్​ గెలిచిన మొదటి క్రొయేషియా డబుల్స్​ జోడీగా మెక్టిక్-పావిక్‌ జోడీ చరిత్ర సృష్టించింది. కాగా, మెక్టిక్​-పావిక్​ జంటకు ఈ సీజన్​లో ఇది ఎనిమిదో టైటిల్​ కావడం విశేషం. 

ఇదిలా ఉంటే, 2018 ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్​ ఓపెన్​ను వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందిన పావిక్‌కు.. మెక్టిక్​తో కలిసి ఇదే తొలి టైటిల్‌. మరోవైపు మెక్టిక్‌కు మాత్రం ఇదే తొలి గ్రాండ్​స్లామ్​. ఈ క్రొయేషియా జోడీ టోక్యో ఒలింపిక్స్​లోనూ జంటగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు, శనివారమే జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సువే(తైవాన్)-ఎలిస్ మెర్టన్స్(బెల్జియం) జోడీ ​6-3, 5-7, 7-9తో వెరోనికా కుడెర్మెటోవా- ఎలెనా వెస్నినా(రష్యా) ద్వయంపై విజయం సాధించి వింబుల్డన్ 2021 మహిళల డబుల్స్‌ టైటిల్‌ని సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే, కెరీర్‌లో 20వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకుని దిగ్గజ ఆటగాళ్లైన రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ సరసన నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్న సెర్బియా స్టార్‌ నొవాక్ జకోవిచ్.. తుది పోరులో ఏడో సీడ్ ఇటలీ ఆటగాడు మాటియో బెరెటినితో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు