Wimbledon 2021: 39 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ఓపెన్ ఎరాలో ఒకే ఒక్కడు 

6 Jul, 2021 15:06 IST|Sakshi

లండన్: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విన్నర్‌(20), టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) అరుదైన రికార్డు నెలకొల్పాడు. వింబుల్డ‌న్ ఓపెన్ ఎరాలో 39 ఏళ్ల వ‌య‌సులో క్వార్ట‌ర్స్‌కు చేరిన తొలి ఆట‌గాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత టోర్నీలో ఇట‌లీకి చెందిన లోరెంజో సొనేగాపై గెలిచి క్వార్ట‌ర్స్‌లోకి అడుగుపెట్టడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించాడు. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న అతి పెద్ద వయసు ఆట‌గాడు ఫెద‌ర‌ర్‌ మాత్రమే కావడం విశేషం. కాగా, ఈ స్విస్‌ యోధుడు మరో ఐదు వారాల్లో 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.

సోమ‌వారం జ‌రిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆర‌వ సీడ్‌ రోజర్‌ ఫెద‌ర‌ర్ 7-5, 6-4, 6-2తో లోరెంజో సొనేగా (ఇట‌లీ)పై అల‌వోకగా విజ‌యం సాధించాడు. మోకాలి స‌ర్జ‌రీ కారణంగా ఇటీవ‌లి కాలంలో ఫామ్‌ను కోల్పోయిన ఫెడెక్స్‌.. గ్రాస్‌ కోర్టుపై మాత్రం చెల‌రేగుతున్నాడు. ఈ క్రమంలో అతను వింబుల్డ‌న్‌లో రికార్డు స్థాయిలో 18వ సారి క్వార్ట‌ర్స్‌కు చేరాడు. ఫెదరర్‌ తన తర్వాతి మ్యాచ్‌లో డానియల్ మెద్వెదెవ్​ లేదా హుబెర్ట్​ హుర్కాజ్తో తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ జకోవిచ్‌, ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ), పదోసీడ్‌ షపొవలోవ్‌ (కెనడా), కచనోవ్‌ (రష్యా), ఫుక్సోవిచ్‌ (హంగేరి) కూడా ప్రీక్వార్టర్స్‌ను అధిగమించారు. ఇక మహిళల విభాగంలో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ, రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌), ఆన్స్‌ జబేర్‌ (ట్యునీషియా), కెర్బర్‌ (జర్మనీ), ముచోవా (చెక్‌), గొల్బిచ్‌ (స్విట్జర్లాండ్‌)లు క్వార్టర్స్‌కు చేరారు.

మరిన్ని వార్తలు