ఫెడరర్‌కు షాక్‌

8 Jul, 2021 03:59 IST|Sakshi

 క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం

హుబర్ట్‌ హుర్కాజ్‌ సంచలనం

ఎదురులేని జొకోవిచ్‌

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రికార్డుస్థాయిలో 22వసారి బరిలోకి దిగిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ కథ క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. గతంలో ఎనిమిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన 39 ఏళ్ల ఫెడరర్‌ను 14వ సీడ్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌) ఇంటిముఖం పట్టించాడు. గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల హుబర్ట్‌ 6–3, 7–6 (7/4), 6–0తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి కెరీర్‌లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో ఫెడరర్‌పై హుబర్ట్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. హుబర్ట్‌ దూకుడైన ఆటకు ఫెడరర్‌ సమాధానం ఇవ్వలేకపోయాడు. సునాయాసంగా గెలవాల్సిన పాయింట్లను కూడా ఫెడరర్‌ కోల్పోయాడు. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన ఫెడరర్‌ మూడు డబుల్ట్‌ ఫాల్ట్‌లు చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయగలిగాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 81 కేజీల బరువున్న హుబర్ట్‌ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ఫెడరర్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు.    

పదోసారి సెమీస్‌లో జొకోవిచ్‌
మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 6–4, 6–4తో ఫుచోవిచ్‌ (హంగేరి)పై గెలిచి పదోసారి సెమీఫైనల్లోకి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పదో సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా)తో జొకోవిచ్‌ తలపడతాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో షపోవలోవ్‌ 6–4, 3–6, 5–7, 6–1, 6–4తో 25వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)ను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌ చేరాడు.  

పోరాడి ఓడిన సానియా–బోపన్న జంట
మిక్స్‌డ్‌ డబుల్స్‌ మూడో రౌండ్‌లో సానియా మీర్జా–రోహన్‌ బోపన్న (భారత్‌) జంట 3–6, 6–3, 9–11తో జీన్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌)– క్లెపాక్‌ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది.   
తన కెరీర్‌లో ఫెడరర్‌ ప్రత్యర్థికి ఓ సెట్‌ను 0–6తో కోల్పోవడం ఇది ఐదోసారి మాత్రమే. గతంలో విన్సెంట్‌ స్పాడియా (1999లో మోంటెకార్లో మాస్టర్స్‌ టోర్నీ), ప్యాట్రిక్‌ రాఫ్టర్‌ (1999లో ఫ్రెంచ్‌ ఓపెన్‌), బైరన్‌ బ్లాక్‌ (1999లో క్వీన్స్‌ క్లబ్‌ టోర్నీ), నాదల్‌ (2008లో ఫ్రెంచ్‌ ఓపెన్‌) మాత్రమే ఫెడరర్‌ను ఓ సెట్‌లో 6–0తో ఓడించారు.

గ్రాస్‌కోర్టులపై ఫెడరర్‌ను వరుస సెట్‌లలో ఓడించిన నాలుగో ప్లేయర్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌. గతంలో కఫెల్నికోవ్‌ (వింబుల్డన్‌ –2000), అన్‌చిచ్‌ (వింబుల్డ¯Œ  –2002), ఆండీ ముర్రే (లండన్‌ ఒలింపిక్స్‌–2012) ఈ ఘనత సాధించారు.

మరిన్ని వార్తలు