Wimbledon 2022: వ్యాక్సిన్‌ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్‌

27 Jun, 2022 18:53 IST|Sakshi

Novak Djokovic : కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునే విషయంలో ప్రముఖ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ పట్టు వీడడం లేదు. ప్రాణం పోయినా తాను వ్యాక్సిన్‌ వేసుకునే ప్రసక్తే లేదని మరోసారి తెగేసి చెప్పాడు. ఈ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌కు వేదిక అయిన యునైటెడ్‌ స్టేట్స్‌లో అడుగుపెట్టాలంటే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన నేపథ్యంలో జకో ఈ మేరకు స్పందించాడు. 

యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగేందుకైనా సాహసిస్తాను కానీ వ్యాక్సిన్‌ మాత్రం వేసుకోనని ఖరాకండిగా తేల్చి చెప్పాడు. వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఇష్టం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం సహేతుకం కాదని వివరించాడు. వ్యాక్సిన్‌ వేయించుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, అలా అని తాను వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్‌ బరిలో ఉన్న జకో.. ఇవాళ (జూన్‌ 27) తొలి రౌండ్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు.

ఇదిలా ఉంటే, గతేడాది మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్‌ సహా) నెగ్గిన జకోవిచ్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం జకో ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. 
చదవండి: Wimbledon 2022: జొకోవిచ్‌పైనే దృష్టి
 

మరిన్ని వార్తలు