Wimbledon 2022 Final: జబర్‌, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే!

8 Jul, 2022 08:22 IST|Sakshi
తొలి టైటిల్‌ వేటలో జబర్‌, రిబాకినా(PC: Wimbledon Twitter )

తొలి టైటిల్‌ కోసం శనివారం తుది పోరు  

Wimbledon 2022 Women's Singles Final- లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌ రావడం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో అన్స్‌ జబర్‌ (ట్యునీషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) తలపడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర సృష్టిస్తారు.

జబర్‌ గెలిస్తే ఆఫ్రికా ఖండంనుంచి గ్రాండ్‌స్లామ్‌ సాధించిన తొలి మహిళ అయ్యే అవకాశం ఉండగా...రిబాకినా విజేతగా నిలిస్తే కజకిస్తాన్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన తొలి మహిళగా నిలుస్తుంది.

గురువారం జరిగిన తొలి సెమీస్‌లో మూడో సీడ్‌ జబర్‌ 6–2, 3–6, 6–1తో తత్యానా మారియా (జర్మనీ)పై విజయం సాధించింది. దూకుడుగా ఆడిన జబర్‌ తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. అయితే రెండో సెట్‌లో 17 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌ చేసిన ఆమె సెట్‌ను కోల్పోయింది. నిర్ణాయక సెట్‌లో మాత్రం మారియాపై జబర్‌ పూర్తిగా పైచేయి సాధించింది. 

మాజీ చాంపియన్‌కు ఓటమి... 
మరో సెమీస్‌లో 23 ఏళ్ల కజకిస్తాన్‌ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా సత్తా చాటింది. 23 ఏళ్ల రిబాకినా తన రెండో వింబుల్డన్‌లోనే ఫైనల్‌ చేరింది. 76 నిమిషాల సాగిన సెమీస్‌లో రిబాకినా 6–3, 6–3తో 2019 వింబుల్డన్‌ విజేత సిమోనా హలెప్‌ (రొమేనియా)ను ఓడించింది. మాస్కోలో పుట్టి 2018 వరకు రష్యాకు ప్రాతినిధ్యం వహించిన రిబాకినా రష్యా ఆటగాళ్లపై వింబుల్డన్‌లో నిషేధం ఉన్న సమయంలో ఫైనల్‌కు చేరడం విశేషం.

మరిన్ని వార్తలు