Wimbledon 2022: జొకోవిచ్‌ అలవోకగా...

2 Jul, 2022 05:24 IST|Sakshi

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌  

లండన్‌: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 6–0, 6–3, 6–4తో 25వ సీడ్‌ కెచ్‌మనోవిచ్‌ (సెర్బియా)పై గెలిచాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.

మాజీ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6–4, 6–4, 4–6, 6–3తో బెరాన్‌కిస్‌ (లిథువేనియా)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. రెండో రౌండ్‌లో క్వాలిఫయర్‌ జాక్‌ సాక్‌ (అమెరికా) 6–4, 6–4, 3–6, 7–6 (7/1)తో మాక్సిమి క్రెసీ (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. దాంతో 1995 తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరిన అమెరికా ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.  

హీతెర్, జబర్‌ ముందంజ
మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా) 6–2, 6–3తో డయానా పెరీ (ఫ్రాన్స్‌)పై, హీతెర్‌ వాట్సన్‌ (బ్రిటన్‌) 7–6 (8/6), 6–2తో కాజా జువాన్‌ (స్లొవేనియా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. హీతెర్‌ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరడం విశేషం.

మరిన్ని వార్తలు