Wimbledon 2022: నాదల్‌ అదరహో

7 Jul, 2022 06:33 IST|Sakshi

ఐదు సెట్‌ల పోరులో అమెరికా ప్లేయర్‌ ఫ్రిట్జ్‌పై విజయం

వింబుల్డన్‌ టోర్నీలో ఎనిమిదోసారి సెమీస్‌లోకి

లండన్‌: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన నాదల్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 36 ఏళ్ల నాదల్‌ 4 గంటల 21 నిమిషాల్లో 3–6, 7–5, 3–6, 7–5, 7–6 (10/4)తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో 11వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు.

మ్యాచ్‌ రెండో సెట్‌లో నాదల్‌కు పొత్తి కడుపులో నొప్పి రావడంతో మెడికల్‌ టైమ్‌అవుట్‌ తీసుకొని చికిత్స చేయించుకొని ఆటను కొనసాగించాడు. ఆ తర్వాత మొండి పట్టుదలతో ఆడిన నాదల్‌ చివరకు విజయతీరం చేరాడు. మ్యాచ్‌ మొత్తంలో ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. నెట్‌ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన నిక్‌ కిరియోస్‌తో నాదల్‌ తలపడతాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో కిరియోస్‌ 6–4, 6–3, 7–6 (7/5)తో క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ)పై గెలిచి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు.  

హలెప్‌ జోరు
మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో 2019 చాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 6–2, 6–4తో అనిసిమోవా (అమెరికా)పై... రిబాకినా (కజకిస్తాన్‌) 4–6, 6–2, 6–3తో తొమ్లాజనోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గి సెమీస్‌ చేరారు. మరో క్వార్టర్‌ ఫైనల్లో ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా) 3–6, 6–1, 6–1తో మేరీ బుజ్‌ కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి అరబ్‌ ప్లేయర్‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు