Wimbledon Tennis tournament: ‘క్వీన్‌’ రిబాకినా

10 Jul, 2022 01:47 IST|Sakshi

వింబుల్డన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ హస్తగతం

ఫైనల్లో ఆన్స్‌ జబర్‌పై విజయం

గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి కజకిస్తాన్‌ ప్లేయర్‌గా ఘనత

రూ. 19 కోట్ల 7 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

లండన్‌: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా... తొలి సెట్‌ కోల్పోయినా ఆందోళన చెందకుండా... ఆద్యంతం పట్టుదలతో పోరాడిన కజకిస్తాన్‌ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తన ‘గ్రాండ్‌’కలను సాకారం చేసుకుంది. శనివారం జరిగిన వింబుల్డన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 23 ఏళ్ల రిబాకినా చాంపియన్‌గా అవతరించింది.

గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ రిబాకినా 3–6, 6–2, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన తొలి కజకిస్తాన్‌ ప్లేయర్‌గా రిబాకినా చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచిన రిబాకినాకు 20 లక్షల బ్రిటిష్‌ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్‌ జబర్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

తడబడి... నిలబడి
ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జబర్‌ ఫైనల్లోనూ జోరు కొనసాగించింది. వైవిధ్యభరిత డ్రాప్‌ షాట్‌లు, పాసింగ్‌ షాట్‌లతో చెలరేగిన జబర్‌ మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్‌ చేసి 32 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. తొలి సెట్‌ కోల్పోయినా రిబాకినా పట్టుదల కోల్పోలేదు. రెండో సెట్‌లోని తొలి గేమ్‌లోనే జబర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన రిబాకినా అదే జోరులో ఐదో గేమ్‌లోనూ బ్రేక్‌ సాధించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ తర్వాత శక్తివంతమైన సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్‌ షాట్‌లతో విజృంభించిన రిబాకినా 39 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లోని తొలి గేమ్‌లో మళ్లీ జబర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన రిబాకినా... ఆ తర్వాత ఏడో గేమ్‌లో మరోసారి జబర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది. ఎనిమిదో గేమ్‌లో రిబాకినా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. నేడు జొకోవిచ్‌ (సెర్బియా), కిరియోస్‌ (ఆస్ట్రేలియా) మధ్య పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ జరుగుతుంది.

ఫైనల్‌ గణాంకాలు
రిబాకినా                  ఆన్స్‌ జబర్‌
4            ఏస్‌లు           4
3         డబుల్‌ఫాల్ట్‌లు    1
17/36    నెట్‌ పాయింట్లు    7/14
4/6    బ్రేక్‌ పాయింట్లు    2/11
29    విన్నర్స్‌    17
33    అనవసర తప్పిదాలు    24
86    మొత్తం పాయింట్లు    80

మరిన్ని వార్తలు