T10 League: నరాలు తెగే ఉత్కంఠ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు

24 Mar, 2022 18:26 IST|Sakshi
ఆండ్రీ ఫ్లెచర్‌(ఫైల్‌ ఫోటో)

మ్యాచ్‌ ఆధ్యంతం  బ్యాట్స్‌మన్‌ సిక్సర్ల వర్షం కురిపించడం ఒక ఎ‍త్తు.. కానీ టప్‌ గేమ్‌ను సిక్సర్లతో ముగించడం మరొక ఎత్తు. ఆ బాధ్యతను విండీస్‌ క్రికెటర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ సమర్థంగా నిర్వహించాడు. 3 బంతుల్లో 16 పరుగులు చేస్తే జట్టు గెలుస్తుంది. ప్రతీ బంతి సిక్సర్‌ వెళితే గానీ సదరు జట్టు గెలవదు. కానీ ఫ్లెచర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కాగా ఫ్లెచర్‌కు ''స్పైస్‌మాన్‌'' అనే బిరుదు కూడా ఉంది.

విషయంలోకి వెళితే.. విన్సీ ప్రీమియర్‌ లీగ్‌ 2022లో భాగంగా బొటానికల్‌ గార్డెన్స్‌ రేంజర్స్‌, ఫోర్ట్‌ చార్లెట్‌ స్ట్రైకర్స్‌ మధ్య టి10 మ్యాచ్‌ జరిగింది. నరాల తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బొటానికల్‌ గార్డెన్స్‌ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫోర్ట్‌ చార్లెట్‌ స్ట్రైకర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన బొటానికల్‌ గార్డెన్స్‌కు ఆఖరి ఓవర్‌లో విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి.


కొర్టోన్‌ లావియా ఆఖరి ఓవర్‌ వేయగా.. క్రీజులో ఫ్లెచర్‌ ఉన్నాడు. అప్పటికే 27 బంతుల్లో 39 పరుగులతో ఆడుతున్నాడు. మొదటి బంతికి ఎలాంటి పరుగు రాలేదు. రెండో బంతికి లెగ్‌బైస్‌, నో బాల్‌ రూపంలో బౌండరీతో పాటు ఒక రన్‌ అదనంగా వచ్చింది. మరుసటి రెండు బంతులు డాట్‌ బాల్స్‌. దీంతో చివరి మూడు బంతుల్లో 16 పరుగులు కావాలి. లావియా వేసిన ఫుల్‌టాస్‌ను స్వ్కేర్‌ లెగ్‌ దిశగా భారీ సిక్సర్‌ సంధించాడు. ఆ మరుసటి బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. అంతే ఆఖరి బంతికి సిక్స్‌ కొడితే ఫ్లెచర్‌ జట్టు విజయాన్ని అందుకుంటుంది. అలా చివరి బంతి వేయగానే ఫ్లెచర్‌ స్ట్రెయిట్‌ సిక్స్‌ను సంధించాడు. ఫ్లెచర్‌ 34 బంతుల్లో మెరుపు అర్థశతకంతో పాటు జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఫ్లెచర్‌పై సహచరులు అభినందనల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్‌ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు

PAK vs AUS: స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఫీట్‌.. టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!

మరిన్ని వార్తలు