IND vs ZIM: 'ఎందుకు రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చావు.. గోల్డెన్‌ ఛాన్స్‌ కోల్పోయావుగా'

20 Aug, 2022 19:35 IST|Sakshi

ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నిరాశపరిచాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే తొలి వన్డేలో  రాహుల్‌ జట్టులో ఉన్నప్పటికీ ఓపెనర్‌గా రాలేదు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లుగా వచ్చిన ధావన్‌, గిల్‌ జోడి భారత్‌కు 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది.

ఇక రెండో వన్డేలో గిల్‌ను కాదని ఓపెనర్‌గా వచ్చి విఫలమైన రాహుల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. "ఆసియా కప్‌కు ముందు భారీ ఇన్నింగ్స్‌ ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయావు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వన్డేల్లో ఓపెనర్‌గా రాహుల్‌పనికిరాడని సోషల్‌ మీడియాలో వాపోతున్నారు.

కాగా ఆసియాకప్‌కు ముందు రాహుల్‌కు తన రిథమ్‌ను తిరిగి పొందడానికి మూడో వన్డే రూపంలో మరో అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో రాహుల్‌ ధావన్‌తో కలిసి బ్యాటింగ్‌కు వస్తాడా లేదా గిల్‌నే ఓపెనర్‌గా పంపిస్తాడో వేచి చూడాలి.  ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే ఆగస్టు 22న హరారే వేదికగా జరగనుంది.

5 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. జింబాబ్వేపై భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే  భారత బౌలర్లు విజృం‍భించడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో షాన్‌ విలియమ్స్‌ 42 పరగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో శార్థూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, కుల్ధీప్‌ యాదవ్‌, హుడా,ప్రసిద్ధ్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు. కాగా 43 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టును గెలిపించిన శాంసన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.


చదవండి: Asia Cup 2022: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు