Rumeli Dhar Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌ బై

22 Jun, 2022 15:46 IST|Sakshi
రుమేలీ ధార్‌

టీమిండియా మహిళా క్రికెట్‌లో మరో శకం ముగిసింది. మహిళా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రుమేలీ ధార్‌ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2005 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన టీమిండియా జట్టులో రుమేలీ ధార్‌ సభ్యురాలు. ఈ విషయాన్ని రుమేలీ ధార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ''23 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని శ్యామ్‌నగర్‌లో ప్రారంభమైన నా క్రికెట్‌ కెరీర్‌ నేటితో ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఇక 2005 నా కెరీర్‌లో మరిచిపోలేని సంవత్సరం. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌ చేరడం.. అందులో నేను భాగస్వామ్యం అవడం ఎప్పటికి మరిచిపోలేను.


మెన్‌ ఇన్‌ బ్లూ డ్రెస్‌లో కప్‌ కొట్టలేదన్న వెలితి తప్ప మిగతా అంతా సంతోషంగానే అనిపించింది. ఆ తర్వాత గాయాలు తరచూ వేధించినప్పటికి తిరిగి ఫుంజుకొని టీమిండియాకు ఆడాను. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే రిటైర్మెంట్‌కు ఇదే కరెక్ట్‌ అని భావించాను. ఇంతకాలం నాకు సహకరించిన కుటుంబసభ్యులకు, బీసీసీఐ, నా స్నేహితులకు కృతజ్ఞతలు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నేను ప్రాతినిధ్యం వహించిన అన్ని జట్లకు నా తరపున మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.'' అంటూ ముగించింది.

2003లో ఇంగ్లండ్‌ పర్యటనలో రుమేలీ ధార్‌ టీమిండియా తరపున మహిళల క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. రుమేలీ ధార్‌ చివరిసారి 2018లో టీమిండియా తరపున ఆడింది. ఇండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ట్రై సిరీస్‌ ఆమెకు ఆఖరుది. 19 ఏళ్ల కెరీర్‌లో టీమిండియా తరపున 78 వన్డేల్లో 961 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టింది. ఇక నాలుగు టెస్టుల్లో 236 పరుగులతో పాటు  వికెట్లు తీసింది. 18 టి20ల్లో 131 పరుగులు చేసిన రుమేలీ ధార్‌ బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టింది.


2005లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్‌ చేరడంలో రుమేలీ ధార్‌ పాత్ర కూడా ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 98 పరుగుల తేడాతో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2009 టి20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన రుమేలీ ధార్‌.. ఒక పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రుమేలీ ధార్‌ మరో బౌలర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచింది. 

A post shared by Rumeli Dhar (@rumelidhar54)

చదవండి: ఐసీయూలో వెంటిలేటర్‌పై పాక్‌ దిగ్గజ క్రికెటర్‌

>
మరిన్ని వార్తలు