Women Asia Cup 2022 INDW VS BANW: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్‌

8 Oct, 2022 16:34 IST|Sakshi

మహిళల ఆసియా కప్‌-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ షెఫాలీ వర్మ పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మెరుపు అర్ధసెంచరీ (44 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదిన షెఫాలీ.. అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో టీమిండియాకే చెందిన జెమీమా రోడ్రిగ్స్‌ పేరిట ఉండేది. రోడ్రిగ్స్‌ 21 ఏళ్ల 32 రోజుల వయసులో 1000 పరుగుల మైలురాయిని అందుకోగా.. షెఫాలీ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆ రికార్డును అధిగమించింది. 

ఈ రికార్డుతో పాటు షెఫాలీ ఇదే మ్యాచ్‌లో మరో రికార్డు కూడా సాధించింది. టీ20 అరంగేట్రం తర్వాత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. షెఫాలీ 3 ఏళ్ల 14 రోజుల్లో ఈ ల్యాండ్‌మార్కును చేరుకోగా.. గతంలో ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌ 3 ఏళ్ల 87 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకుంది. పై రెండు రికార్డులతో పాటు షెఫాలీ ఈ మ్యాచ్‌లో మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగుల పూర్తి చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. షెఫాలీ 1000 పరుగులను కేవలం 735 బంతుల్లోనే పూర్తి చేసి, మరే మహిళా క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. టాప్‌ త్రీ బ్యాటర్లు షెఫాలీ వర్మ (55), కెప్టెన్‌ మంధాన (47), జెమీమా రోడ్రిగ్స్‌ (35 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితం కావడంతో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ, షెఫాలీ వర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. రేణుక సింగ్‌, స్నేహ్‌ రాణా తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న షెఫాలీ వర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

మరిన్ని వార్తలు