స్టన్నింగ్‌ డైవ్‌ క్యాచ్‌, వహ్వా అనాల్సిందే!

7 Nov, 2020 12:58 IST|Sakshi

అలా దూరంగా వెళ్తున్న బంతిని సైతం గాల్లో పల్టీలు కొడుతూ క్యాచ్‌ పడితే.. అదిరిపోయే క్యాచ్‌ అంటూ ఆ ఫీల్డర్‌పై ప్రశంసలు కురిపిస్తాం. అదే సమయంలో ఆ క్యాచ్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తే అభిమానులు మరింత కేరింతలు కొడతారు. తాజాగా, మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇలాంటి ఓ డైవింగ్‌ క్యాచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. బ్రిస్బేన్‌ హీట్‌ వుమెన్‌ వర్సెస్‌ అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ వుమెన్‌ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ వెలుగు చూసింది. 17 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో.. అడిలైడ్‌ స్పిన్నర్‌ అమంద వెల్లింగ్టన్‌ విసిరిన ఫుల్‌టాస్‌​ బంతిని అమెలియా కేర్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీకి తరలించాలనుకుంది. 

ఆమె కొట్టిన షాట్‌ బాల్‌ను షార్ట్‌ మిడ్‌ వికెట్‌ వద్ద ఉన్న మ్యాడీ పెన్నా క్యాచ్‌ కోసం ప్రయత్నించగా.. ఫలించలేదు. ఆమె చేతులను తాకుతూ బంతి అమాంతం పైకి లేచి బుల్లెట్‌లా బౌండరీ వైపుగా దూసుకెళ్తోంది. పెన్నాకు సమీపంలోనే ఉన్న తాహిలా మెక్‌గ్రాత్‌ చాకచక్యంగా ఫుల్‌లెంగ్త్‌లో డైవ్‌ చేసి ఆ బంతిని ఒడిసిపట్టింది. అప్పటికే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బ్రిస్బేన్‌ జట్టు తాజా వికెట్‌తో ఒత్తిడికి లోనైంది. ఫలితంగా అడిలైడ్‌ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్ జట్టు 20 ఓవర్లకు 153 పరుగులు చేయగా.. బ్రిస్బేన్‌ జట్టు 135 పరుగులే చేయగలిగింది.

మరిన్ని వార్తలు