Mirabai Chanu: జయహో చాను.. ఆమె తొలి కోచ్ ఎవరంటే?

24 Jul, 2021 18:03 IST|Sakshi

మేము సైతం అంటున్న మహిళా క్రీడాకారిణులు 

దేశానికి వన్నె ఈ  మణిపూసలు

సమానం కాదు.. మేమే ఫస్ట్‌

సాక్షి, వెబ్‌డెస్క్‌:  కరోనా మహమ్మారి ప్రకంపనల మధ్య అసలు ఒలింపిక్  ఉత్సాహం  ఉంటుందో  లేదో అన్న సందేహాల నడుమ ఎట్టకేలకు  జపాన్ రాజధాని టోక్యో నగరం సిద్దమై పోయింది.  సంబరం అలా మొదలైందో లేదో ఇలా ఒక పతకం భారత సిగలో మెరవడం విశేషమే మరి. అయితే  ఈ సందర్భంగా వెయిట్‌ లిఫ్టింగ్‌లో పతకాలతో మెరిసి మురిపించిన  లెజెండరీ భారతీయ  మహిళల గురించి తెలుసుకుందాం.

రంగం ఏదైనా పురుషులతో సమానంగా అనే మాటను మన అమ్మాయిలు అధిగమించి తమకుతామే సాటి అంటూ దూసుకుపోతున్నారు. అన్నింటా మేమే ఫస్ట్‌ అంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్‌... టెన్నిస్‌..బ్యాడ్మింటన్‌..క్రికెట్‌ ఇలా క్రీడ ఏదైనా ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు.  టోక్యో ఒలింపిక్‌  క్రీడా సంగ్రామం వేదికగా ఇది మరోసారి నిరూపితమైంది.  

Chanu Saikhom Mirabai టోక్యో ఒలంపిక్స్‌లో తొలి పతకంతో  శుభారంభం చేసి ప్రపంచం దృష్టిని తన  వైపుతిప్పుకుని  భారత  కీర్తి ప్రతిష్టలను  ఇనుమడింప జేశారు మన మణిపూర్‌ మణిపూస. మణిపూర్‌కు చెందిన  క్రీడాకారిణి  మీరాబాయి చాను వెయింట్ లిప్టింగ్ పోటీల్లో  49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత  మన దేశానికి వన్నె తెచ్చిన పతకమిది. ‘‘బంగారం పతకం కోసం చాలా ప్రయత్నించా.. కానీ సాధ్యం కాలేదు. కానీ సెకండ్‌ లిఫ్ట్‌ తరువాత పతకం ఖాయమని అర్థమైపోయిందంటూ’’ ఆమె సంబరపడిపోయారు. అంతేకాదు ‘‘ముందు ఒక పిజ్జా తినాలి..పిజ్జా తిని ఎన్ని రోజులైందో’’ అంటూ అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించారు. మరోవైపు తన విద్యార్థి మొత్తం దేశం మోముపై చిరునవ్వులు పూయస్తోందంటూ మీరా బాయి గురువు , మరో ప్రఖ్యాత వెయిట్‌ లిఫ్టర్‌ కుంజారాణీ దేవి సంతోషం వ్యక్తం చేశారు. 

మణిపూర్‌ మణిపూస కుంజరాణీ దేవి
వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని సైతం అందుకుని భారతీయ వెయిట్ లిఫ్టింగులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహిళ మణిపూర్‌కే చెందిన కుంజారాణీ దేవి. మీరా బాయికి తొలి అడుగులు నేర్పిన గురువు కుంజారాణి కావడం ఇక్కడ మరో విశేషం. ఆమె కరీర్‌ను రూపొందించడంలో ఆమెది కీలక పాత్ర.  2015 వరకు తనకు గురువుగా వున్న ఆమె స్టయిల్‌ను ఫాలో అవుతానని, ఆమెను చూసే వెయిట్‌ లిఫ్టింగ్‌ను కరియర్‌గా ఎంచుకున్నానని స్వయంగా మీరా బాయే చెప్పుకున్నారు.

1985 సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 44, 46, 48 కిలోల విభాగాల్లో పతకాలు సాధించారామె.  1989లో  మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు సాదించారు. 1990లో బీజింగ్, 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజత పతకాన్నితన ఖాతాలో వేసుకున్నారు. 1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక రజత, రెండు కాంస్య పతకాలు 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించారు. 

ఇక ఆ తరువాత 1992లో థాయిలాండ్ లోను, 1993లో చైనా పోటీల్లోనూ తన రెండవ స్థానాన్ని సాధించారు. 1995లో దక్షిణకొరియాలో జరిగిన పోటీల్లో 46 కిలోల విభాగంలో రెండు బంగారు పతకాలు, ఒక రజతపతకాన్ని సొంతం చేసుకున్నారు. యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఆమె సొంతం. 2006 మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు, 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పారు.

తెలుగు తేజం కరణం మల్లీశ్వరి
1990వ దశకంలో ఒలింపిక్‌  వేదికగా  మువ్వన్నెల పతాకానికి వన్నె తెచ్చిన  తెలుగు తేజం కరణం మల్లీశ్వరి.  శ్రీకాకుళానికి చెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి  కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్ పతకం కాంస్య పతకం సాధించారు. ఈ సమయంలో భారత్‌కు ఏకైక పతకాన్ని సాధించి, దేశ ప్రతిష్టను సమున్నతంగా నిలబెట్టిన ఆ క్షణాలను సగటు భారతీయుడు ఎలా మర్చిపోగలడు.  

1994 అర్జున, 1999లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలతోపాటు, 11 స్వర్ణాలతో సహా మొత్తం 29 అంతర్జాతీయ పతకాలు సాధించిన రికార్డు మల్లీశ్వరి సొంతం. అందుకే దేశ రాజధాని ఢిల్లీలోని క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ పదవి ఆమెను వచ్చి వరించింది. పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. 

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరగాల్సిన కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతోంది. ఆగస్టు నెల 8వ తేదీవరకు క్రీడా సంగ్రామం హోరా హోరీగా జరగనుంది. మన దేశం నుంచి 119మంది పాల్గొంటున్న ఈ ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు, రికార్డులు మన సొంతం కావాలని కోరుకుందాం. ముఖ్యంగా బాక్సింగ్‌ మేరీ కోమ్ ఈ ఒలంపిక్‌లో ఎలాగైనా గోల్డ్‌ కొట్టాలి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, సీడబ్ల్యుజీ బంగారు పతక విజేత, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత, ఆసియా ఛాంపియన్‌షిప్ బంగారు పతక విజేత, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నప్పటికీ .. ఇపుడు బంగారు పతకం సాధించాలనేది ఆశ. ఇందుకు 2020 టోక్యో గేమ్స్ ఆఖరి అవకాశం. 

వివిధ క్రీడల్లో దేశానికి అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన మహిళామణుల గురించి రాయాలంటే చాలా పెద్దలిస్టే.. భారత తొలి మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జి మొదలు పరుగుల రాణి పీటీ ఉష, బాక్సింగ్‌కు మారుపేరు మేరీ కోమ్...కుస్తీ వస్తాదు సాక్షీ మాలిక్,  టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ స్టార్లు పీవీ సింధు, సైనా.. చదరంగంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ భాగ్యశ్రీ థిప్సే, కోనేరు హంపీ, హారిక.. ఇక క్రికెట్‌లో మిథాలీరాజ్.. సఫాలీ వర్మ ఇలా ఎందరో.. మరెందరో.. అందరికీ మరోసారి జయహో...!

మరిన్ని వార్తలు