WC 2022 Final: అలిస్సా హేలీ ఊచకోత.. పాపం ఇంగ్లండ్‌ బౌలర్లు

3 Apr, 2022 10:28 IST|Sakshi

Update: ఐసీసీ మహిళా ప్రపంచకప్‌-2022 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. ఇంగ్లండ్‌ను 71 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ICC Women's World Cup 2022 Final: ఐసీసీ మహిళా ప్రపంచకప్‌-2022 ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ అలిస్సా హేలీ మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి ఇంగ్లండ్‌ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని విధించింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారం నాటి వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు రాచెల్‌ హేన్స్‌(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్‌డౌన్‌లో వచ్చిన బెత్‌మూనీ సైతం 47 బంతుల్లోనే 62 పరుగులు సాధించింది. హేలీ అవుటైన తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. అప్పటికే ఇంగ్లండ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హేలీ విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

A post shared by ICC (@icc)

తద్వారా కొండంత లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ముందుకు ఉంచింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అన్య శ్రుబ్సోలేకు మూడు, సోఫీ ఎక్లిస్టోన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఇక ఆసీస్‌ బ్యాటర్‌ యాష్లీ గార్డ్‌నర్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా సాధించిన స్కోరు: 356/5 (50).

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు