Womens Asia Cup T20: భారత మహిళలకు షాక్‌

8 Oct, 2022 05:09 IST|Sakshi

పాకిస్తాన్‌ చేతిలో అనూహ్య ఓటమి

ఆసియా కప్‌ టి20 టోర్నీ

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): ఆసియా కప్‌ మహిళల టి20 టోర్నీలో జోరుగా దూసుకుపోతున్న భారత బృందానికి బ్రేక్‌ పడింది. ఫేవరెట్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేన పాకిస్తాన్‌ చేతిలో అనూహ్యంగా పరాజయంపాలై ఆశ్చర్యపర్చింది. శుక్రవారం మ్యాచ్‌కు ముందు టి20ల్లో పాక్‌తో 12 సార్లు తలపడి 10 సార్లు గెలిచిన భారత్‌... చివరిసారిగా 2016లో ఆ జట్టు చేతిలో ఓడింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్‌ మన జట్టుపై విజయం సాధించింది.

చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో పాక్‌ 13 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత్‌ 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. గురువారం అనూహ్యంగా థాయ్‌లాండ్‌ చేతిలో ఓడిన పాక్‌ కోలుకొని ఆసియాకప్‌ టోర్నీలో తొలి సారి భారత్‌పై విజయాన్ని అందుకోవడం విశేషం.  

ఓపెనర్లు మునీబా (17; 1 ఫోర్‌), సిద్రా (11; 1 ఫోర్‌)తో పాటు ఒమైమా (0) కూడా విఫలం కావడంతో ఆరు ఓవర్ల లోపే 33 పరుగుల వద్ద పాక్‌ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నిదా దార్‌ (37 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ బిస్మా మారూఫ్‌ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 బంతుల్లో 76 పరుగులు జోడించారు.

దీప్తి శర్మ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, పూజ వస్త్రకర్‌ 2 వికెట్లు తీసింది. ఛేదనలో ఓపెనర్లు సబ్బినేని మేఘన (15; 1 ఫోర్, 1 సిక్స్‌), స్మృతి మంధాన (17; 2 ఫోర్లు), హేమలత (20; 3 ఫోర్లు ) కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఫామ్‌లో ఉన్న జెమీమా (2) విఫలం కాగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ లేకపోయింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మారుస్తూ ఏడో స్థానంలో వచ్చిన హర్మన్‌ ప్రీత్‌ (12) ప్రయోగం విఫలమైంది.

తీవ్ర ఎండ కారణంగా కీపింగ్‌ వదిలి మధ్యలోనే మైదానం వీడిన రిచా ఘోష్‌ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండగా నష్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు సాదియా ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టి రిచా గెలుపుపై ఆశలు రేపింది. అయితే అదే ఓవర్లో ఆమెను సాదియా అవుట్‌ చేయగా... చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా, భారత్‌ 4 పరుగులకే పరిమితమైంది. నష్రా 3 వికెట్లు తీయగా... నిదా, సాదియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే ఐదో లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ ను స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

మరిన్ని వార్తలు