ఒసాకా వివాదంపై స్పందించిన మిథాలీ రాజ్‌ 

1 Jun, 2021 20:51 IST|Sakshi

ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల క్రికెట్‌కు మీడియా మద్దతు అవసరం ఎంతైనా ఉందని, అందుకే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు తానెప్పుడూ డుమ్మా కొట్టాలని అనుకోనని భారత మహిళల టెస్ట్‌, వన్డే జట్ల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వెల్లడించారు. సమాజంలో మీడియా ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి క్రీడారంగానికి చెందిన వారందరూ తెలుసుకోవాలని ఆమె సూచించారు. క్రీడారంగానికి చెందిన వారెవరికైనా క్వారంటైన్‌లో గడపడం కష్టమేనని, ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టాక ఆ కష్టాలు వాటంతటవే కనుమరుగవుతాయని ఒసాకాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. మహిళా క్రికెట్‌ అభ్యున్నతి కోసం తనతో పాటు ప్రతి ఒక్క మహిళా క్రికెటర్‌ కలిసి రావాలని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరు మీడియాతో హుందాగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడేది లేదంటూ టెన్నిస్​ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మిథాలీ ఈ మేరకు స్పందించారు.

కాగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ నంబర్‌ 2 టెన్నిస్​క్రీడాకారిణి ఒసాకా ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్​టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె తీసుకున్న నిర్ణయంతో అభిమానులందరూ నిరాశ చెందడమే కాకుండా, టోర్నీ కూడా కళావిహీనంగా మారిపోయింది. మీడియాతో మాట్లాడేది లేదంటూ, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను బాయ్‌కాట్‌ చేసిన ఒసాకాకు ఆదివారం మ్యాచ్‌ రిఫరీ ఫైన్‌ విధించారు. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకే ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తాను సహజమైన పబ్లిక్‌ స్పీకర్‌ను కాకపోవడం వల్ల ప్రపంచ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతానని, నిజానికి 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి తాను కుంగుబాటులో ఉన్నానని, అందుకే మీడియా సమావేశానికి ఒప్పుకోలేదని ఆమె వివరణ ఇవ్వడం కొసమెరుపు. 
చదవండి: డీకే తిట్టుకున్న బ్యాట్‌తో తొలి ఫిఫ్టీ కొట్టిన రోహిత్‌..

మరిన్ని వార్తలు