Womens Hockey World Cup 2022: ఎట్టకేలకు ఒక విజయం.. ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ

13 Jul, 2022 06:58 IST|Sakshi

కెనడాపై షూటౌట్‌లో భారత మహిళల గెలుపు 

థెరస (స్పెయిన్‌): మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. ఇప్పటికే పతకం రేసుకు దూరమైన అమ్మాయిల జట్టు వర్గీకరణ మ్యాచ్‌లో షూటౌట్‌లో కెనడాను కంగుతినిపించింది. 9 నుంచి 16 స్థానాల కోసం మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సవిత పూనియా సేన షూటౌట్‌లో 3–2తో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి.

కెప్టెన్‌ సవిత గోల్‌పోస్ట్‌ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్‌లో భారత్‌ను గెలిపించింది. షూటౌట్‌ సహా మ్యాచ్‌ మొత్తమ్మీద ఆమె ఏకంగా ఆరు గోల్స్‌ను చాకచక్యంగా అడ్డుకుంది. మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చిన షూటౌట్‌లో భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్, సోనిక, నేహా గోల్స్‌ సాధించారు. 11వ నిమిషంలోనే మ్యాడిలైన్‌ సికో కెనడా తరఫున ఖాతా తెరిచింది. ఆ తర్వాత పలు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చినా భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. అయితే రెండు క్వార్టర్లు ముగిసినా గోల్‌ చేయడంలో వెనుకబడిపోయిన భారత అమ్మాయిలపై ఒత్తిడి పెరిగింది. మూడో క్వార్టర్‌లో స్కోరును సమం చేసేందుకు సువర్ణావకాశం వచ్చింది.

కానీ నవ్‌జ్యోత్‌ కౌర్‌ కొట్టిన షాట్‌ గోల్‌పోస్ట్‌ బార్‌ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. మరోవైపు కెనడా ఫార్వర్డ్‌ లైన్‌ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టుకు మరో పెనాల్టీ కార్నర్‌ లభించగా, సవిత అసాధారణ డైవింగ్‌తో వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఎట్టకేలకు భారత అమ్మాయిలు ఆఖరి క్వార్టర్‌లో అది కూడా మ్యాచ్‌ ముగిసే సమయంలో కెనడా గెలుపుదిశను మార్చేశారు. 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్‌ దిశగా గుర్జీత్‌ కౌర్‌ కొట్టిన షాట్‌ రీబౌండ్‌ కాగా సలిమా టేటే సమయస్ఫూర్తితో గోల్‌గా మలిచింది. దీంతో స్కోరు 1–1తో సమమై షూటౌట్‌కు దారితీసింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోరులో భారత్‌... జపాన్‌తో తలపడుతుంది. 

మరిన్ని వార్తలు