భారత మహిళల పోరు షురూ

3 Jul, 2022 05:50 IST|Sakshi

ప్రపంచకప్‌ హాకీలో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌ 

రా.గం.8నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్ష ప్రసారం

ఆమ్‌స్టర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌): మహిళల ప్రపంచకప్‌ హాకీలో భారత్‌ పోరాటం నేడు మొదలవుతోంది. ఆదివారం జరిగే తమ పూల్‌ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో మన జట్టు కాంస్య పతకంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇంగ్లండ్‌ దూరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతికారం తీర్చుకోవాలనే లక్ష్యంతో సవిత సేన బరిలోకి దిగుతోంది.

ఒలింపిక్స్‌లోనే కాదు... ప్రపంచకప్‌లోనూ మన అమ్మాయిల అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానమే! ప్రారంభ ప్రపంచకప్‌ (1974)లోనే కాంస్య పతకం కోసం పోరాడిన భారత్‌ మళ్లీ ఎప్పుడూ పతకం బరిలో నిలువనే లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌ సీజన్‌లో మేటి జట్లయిన బెల్జియం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచిన సవిత సేన ఇదే జోరును ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. సీనియర్, మాజీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ గాయంతో అందుబాటులో లేకపోయినప్పటికీ... అనుభవజ్ఞురాలైన సవిత జట్టును చక్కగా నడిపిస్తోంది. వైస్‌ కెప్టెన్‌ దీప్‌ గ్రేస్, గుర్జీత్‌ కౌర్, ఉదిత, నిక్కీ ప్రధాన్‌లు నిలకడగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై తొలి దెబ్బ కొట్టేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది.

మరిన్ని వార్తలు