Womens National Boxing Championships: నిఖత్‌ పసిడి పంచ్‌

27 Dec, 2022 05:47 IST|Sakshi

జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌

50 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణ బాక్సర్‌

భోపాల్‌: తెలంగాణ స్టార్‌ బాక్సర్, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్‌ మహిళల (ఎలైట్‌) జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్‌ఎస్‌పీబీ) ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది.

ఆఖరి రోజు పోటీల్లో టైటిల్‌ వేటలో... రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్‌ ముందు రైల్వే బాక్సర్‌ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్‌ఎస్‌పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది.

కానీ 26 ఏళ్ల నిజామాబాద్‌ బాక్సర్‌ మాత్రం తన పంచ్‌ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్‌ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్‌ మేటి బాక్సర్‌ లవ్లీనా 5–0తో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది.

  2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్‌ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్‌ (ప్లస్‌ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్‌ఎస్‌పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు  రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి.

2021 యూత్‌ ప్రపంచ చాంపియన్‌ సనమచ తొక్‌చొమ్‌ (మణిపూర్‌) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్‌ (మధ్యప్రదేశ్‌)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విజేతలకు బహుమతులు అందజేశారు.  జాతీయ చాంపియన్‌గా నిలిచిన  నిఖత్‌ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు.

ఘనమైన సంవత్సరం
ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో నిఖత్‌ జరీన్‌  స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. 

అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్‌ మూడో సారి టైటిల్‌ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్‌ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్‌ పంచ్‌ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్‌ ఎదురైంది.

విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే  కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్‌ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్‌ కేటగిరీకి మారింది.

మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్‌ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్‌ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది.

ఇప్పుడు సీనియర్‌ నేషనల్స్‌ వంతు. వరల్డ్‌ చాంపియన్‌ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్‌ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది.

తొలి మూడు రౌండ్‌లు ‘నాకౌట్‌’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్‌ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్‌ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్‌భట్‌లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది.                
-సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు