గెలిచి నిలిచాం.. బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘనవిజయం

23 Mar, 2022 02:12 IST|Sakshi

రాణించిన స్నేహ్‌ రాణా, యస్తిక

సెమీస్‌ ఆశలు సజీవం

హామిల్టన్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ముందుకెళ్లేందుకు అవసరమైన విజయాన్ని సాధించింది. స్నేహ్‌ రాణా (27 పరుగులు; 4/30) ఆల్‌రౌండ్‌ షోతో... బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సెమీస్‌ అవకాశాల్ని సజీవంగా నిలబెట్టుకుంది. టాస్‌ నెగ్గిన మిథాలీ బృందం మొదట బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ బ్యాటర్‌ యస్తిక భాటియా (80 బంతుల్లో 50; 2 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 30; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. 

ఒకే స్కోరు వద్ద 3 వికెట్లు... 
షఫాలీతో తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించాక స్మృతి అవుటైంది. ఆ వెంటే 5 బంతుల వ్యవధిలో అదే స్కోరు వద్ద షఫాలీ, మిథాలీ రాజ్‌ కూడా (0) వెనుదిరగడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో యస్తిక కీలకమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. తొలుత హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (33 బంతుల్లో 14; 1 ఫోర్‌)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. తర్వాత రిచా ఘోష్‌ (36 బంతుల్లో 26; 3 ఫోర్లు) అండతో ఐదో వికెట్‌కు 54 పరుగులు జతచేసింది. ఇన్నింగ్స్‌ను కుదుట పరిచిన యస్తిక 79 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. మరుసటి బంతికే జట్టు స్కోరు 176 పరుగుల వద్ద ఆమె ఆరో వికెట్‌గా వెనుదిరిగింది. అనంతరం పూజ వస్త్రకర్‌ (33 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు), స్నేహ్‌ రాణాలు జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకుకెళ్లారు. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా 2 వికెట్లు తీశారు.  

తిప్పేసిన స్నేహ్‌ 
ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... భారత ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా తన బౌలింగ్‌ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను కనీసం లక్ష్యం దరిదాపుల్లోకి అయినా వెళ్లకుండా కట్టడి చేసింది. టాపార్డర్‌ను పూనమ్‌ యాదవ్‌ (1/25), రాజేశ్వరి గైక్వాడ్‌ (1/15), పూజ (2/26) కలిసి దెబ్బతీయడంతో బంగ్లా 35 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది. ఈ ఐదుగురిలో ముర్షిదా ఖాతున్‌ (19) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మిడిలార్డర్‌లో లతా మండల్‌ (24), సల్మా ఖాతున్‌ (32) కాస్త మెరుగనిపించడంతో బంగ్లాదేశ్‌ 100 పరుగులు దాటింది. వెటరన్‌ సీమర్‌ జులన్‌ గోస్వామి 2 వికెట్లను పడగొట్టింది. తాజా విజయంతో భారత జట్టు రన్‌రేట్‌ పెరగడమే కాదు... 6 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా (12 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) ముందు వరుసలో ఉన్నాయి. ఈనెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో మిథాలీ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరుతుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు.  

మరిన్ని వార్తలు