Womens ODI World Cup 2022: ప్రపంచ కప్‌ సమరానికి సై.. భారత్‌ తొలి మ్యాచ్‌లోనే..

3 Mar, 2022 05:47 IST|Sakshi

రేపటి నుంచి మహిళల వన్డే వరల్డ్‌కప్‌

బరిలో 8 జట్లు

ఏప్రిల్‌ 3న ఫైనల్‌

సాక్షి క్రీడా విభాగం: క్రికెట్‌లో మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా దాదాపు ఏడాది ఆలస్యంగా జరగబోతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ పోరుకు రేపటితో తెర లేవనుంది. అందమైన న్యూజిలాండ్‌ వేదికగా ఎనిమిది జట్లు 31 రోజుల పాటు తమ సత్తాను చాటేందుకు సన్నద్ధమయ్యాయి. మహిళల క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు ఆతిథ్య కివీస్‌ కూడా తమ వరల్డ్‌కప్‌ విజయాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతుండగా... భారత్‌ సహా మిగిలిన ఐదు జట్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయనేది ఆసక్తికరం. గత రెండేళ్ల పరిస్థితితో పోలిస్తే న్యూజిలాండ్‌ వేదికగా కోవిడ్‌ కట్టుబాట్లను దాటి కాస్త స్వేచ్ఛగా క్రికెటర్లు బరిలోకి దిగనుండటం ఈ మెగా టోర్నీలో ఊరట కలిగించే అంశం. ఐదేళ్ల తర్వాత జరగబోతున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి విశేషాలు.

టోర్నీలో 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్‌ అర్హత సాధించగా, ఐసీసీ ర్యాంకింగ్‌ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాలకు అవకాశం దక్కింది. మిగిలిన మూడు స్థానాలను క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా... కోవిడ్‌ ప్రభావంతో ఆ టోర్నీ రద్దయింది. దాంతో మళ్లీ వన్డే ర్యాంకింగ్‌ ప్రకారమే పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. క్వాలిఫయింగ్‌లో పోరాడేందుకు సిద్ధమైన శ్రీలంక జట్టు వరల్డ్‌కప్‌ అవకాశం కోల్పోయింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ పాల్గొనడం ఇదే తొలిసారి.  

టోర్నీ తేదీలు/వేదికలు: మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు 6 వేదికల్లో టోర్నీ (మొత్తం 31 మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.  

ఫార్మాట్‌: ప్రతీ టీమ్‌ మిగిలిన ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌–4లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్లపరంగా రెండు జట్లు సమంగా నిలిస్తే రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. లీగ్‌ దశలో ‘టై’ మ్యాచ్‌లకు చెరో పాయింట్‌ కేటాయిస్తారు. అయితే సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రం ‘సూపర్‌ ఓవర్‌’ ఉంది. సూపర్‌ ఓవర్‌ కూడా సమమైతే ఫలితం తేలే వరకు మళ్లీ మళ్లీ ఆడిస్తారు. ఈ సారి లీగ్‌ దశ నుంచి కూడా అన్ని మ్యాచ్‌లలో ‘డీఆర్‌ఎస్‌’ అమల్లో ఉంటుంది.

ఆశల పల్లకిలో...
2017లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఫైనల్‌ చేరిన భారత జట్టు చివరకు 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. ఫలితం తర్వాత మన అమ్మాయిల వేదనతో కూడిన దృశ్యాలు క్రికెట్‌ అభిమానుల దృష్టిలో నిలిచిపోయాయి. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో మన జట్టు టైటిల్‌ గెలుచుకోగలదా అనేది ఆసక్తికరం. గత టోర్నీ సమయంతో పోలిస్తే ఈ సారి భారత జట్టు ఫామ్‌ అంత గొప్పగా లేదు. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు కూడా టీమ్‌ సాధించలేకపోయింది.

పైగా న్యూజిలాండ్‌ గడ్డపై ఆడటం మన యువ క్రీడాకారిణులకు పెద్ద సవాల్‌తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో మన జట్టు మొదటి లక్ష్యం సెమీస్‌ చేరడమే. 2005 వరల్డ్‌కప్‌లో కూడా ఫైనల్లో ఓడిన మన టీమ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను 6వ తేదీన పాకిస్తాన్‌తో ఆడుతుంది. అనంతరం 10న న్యూజిలాండ్‌తో, 12న వెస్టిండీస్‌తో, 16న ఇంగ్లండ్‌తో, 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, 27న దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతుంది.

భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్‌ రాణా, జులన్‌ గోస్వామి, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్‌ , తానియా, రాజేశ్వరి, పూనమ్‌ యాదవ్‌.

గత రికార్డు: మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 11 సార్లు  జరగ్గా... ఆస్ట్రేలియా  6 సార్లు, ఇంగ్లండ్‌ 4 సార్లు, న్యూజిలాండ్‌ ఒకసారి విజేతగా నిలిచాయి.

ప్రైజ్‌మనీ ఎంతంటే: 2017 కంటే ఈసారి ప్రైజ్‌మనీని రెట్టింపు చేశారు. విజేతకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్‌ జట్టుకు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 54 లక్షలు), సెమీస్‌లో ఓడిన జట్లకు 3 లక్షల డాలర్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) చొప్పున లభిస్తాయి.
 

మరిన్ని వార్తలు