గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధం, ఆకట్టుకుంటున్న గుజరాత్‌ జెయింట్స్‌ లోగో

13 Feb, 2023 12:08 IST|Sakshi

WPL 2023: మహిళల ఐపీఎల్‌లో అహ్మదాబాద్‌ బేస్‌డ్‌ ఫ్రాంచైజీ అయిన గుజరాత్‌ జెయింట్స్‌ ఆదివారం (ఫిబ్రవరి 12) నాడు తమ జట్టు లోగోను ట్విటర్‌ వేదికగా ఆవిష్కరించింది. వేలానికి ఓ రోజు ముందే గుజరాత్‌ జెయింట్స్‌ లోగోను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రికెట్‌ అభిమానులను, ముఖ్యంగా గుజరాత్‌ ప్రాంత వాసులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లోగోలో గర్జిస్తున్న ఆసియా సింహం (సివంగి) చిహ్నాన్ని పొందుపర్చింది ఫ్రాంచైజీ యాజమాన్యం.

ఈ లోగోకు గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధం అన్న కామెంట్స్‌ను జోడించారు. ఈ రకం ఆసియా సింహం (సివంగి) గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్క్‌లో మాత్రమే కనిపిస్తుంది. గర్జించే సింహం యొక్క చిహ్నం గుజరాత్‌ రాష్ట్ర గౌరవానికి ప్రతీక అంటూ ట్వీట్‌లో పేర్కొంది గుజరాత్‌ జెయింట్స్‌ యాజమాన్యం. గుజరాత్‌ జెయింట్స్‌ లోగో ప్రస్తుతం సోషల్‌మీడియాలో, క్రికెట్‌ సర్కిల్స్‌లో వైరలవుతోంది.

కాగా, అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే అహ్మదాబాద్‌ ఆధారిత సంస్థ గుజరాత్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీను 1289 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చింది సొంతం చేసుకుంది. WPLలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ. దీని తర్వాత ముంబై ఇండియన్స్‌ (ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 912.99 కోట్లు), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 901 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 810 కోట్లు), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 757 కోట్లు) ఫ్రాంచైజీలు ఉన్నాయి.

ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగబోయే WPL తొలి వేలంలో కూడా గుజరాత్‌ జెయింట్స్‌ తమ హవా చూపనుందని సమాచారం. కొందరు దేశీయ ఆటగాళ్ల కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తుంది.     
 

మరిన్ని వార్తలు