టి20 చాలెంజ్‌: విజేత ‘సూపర్‌ నోవాస్‌’

29 May, 2022 04:56 IST|Sakshi

మూడోసారి టైటిల్‌ సాధించిన హర్మన్‌ప్రీత్‌ జట్టు

ఫైనల్లో 4 పరుగులతో వెలాసిటీపై గెలుపు

పుణే: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ‘సూపర్‌ నోవాస్‌’ జట్టు మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో మరోసారి తన సత్తాను ప్రదర్శించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన టీమ్‌ మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సూపర్‌ నోవాస్‌ నాలుగు పరుగుల తేడాతో దీప్తి శర్మ నాయకత్వంలోని వెలాసిటీ జట్టుపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సూపర్‌ నోవాస్‌ జట్టుకు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నోవాస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డియాండ్రా డాటిన్‌ (44 బంతుల్లో 62; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (29 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ప్రియా పూనియా (29 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) రాణించారు. దీప్తి శర్మ, కేట్‌ క్రాస్, సిమ్రన్‌ బహదూర్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేయగలిగింది.

లారా వోల్‌వార్ట్‌ (40 బంతుల్లో 65 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి అజేయంగా నిలిచినా జట్టును గెలిపించడంలో విఫలమైంది. చివరి 3 ఓవర్లలో విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... వోల్‌వార్ట్, సిమ్రన్‌ బహదూర్‌ (10 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 18వ ఓవర్లో 2 సిక్స్‌లతో 14 పరుగులు, 19వ ఓవర్లో 4 ఫోర్లతో 17 పరుగులు రాబట్టారు. దాంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం 17 పరుగులకు మారింది. ఎకెల్‌స్టోన్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి బంతినే వోల్‌వార్ట్‌ సిక్సర్‌గా మలచినా... తర్వాతి 5 బంతుల్లో 6 పరుగులే వచ్చాయి. అలానా కింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా, ఎకెల్‌స్టోన్, పూజ చెరో 2 వికెట్లు తీశారు.

గతంలో మూడు సార్లు మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ జరగ్గా... 2018, 2019లలో సూపర్‌ నోవాస్‌ విజేతగా నిలిచింది. 2020లో ట్రయల్‌ బ్లేజర్స్‌ టైటిల్‌ నెగ్గింది. కరోనా కారణంగా 2021లో ఈ టోర్నీని నిర్వహించలేదు.

మరిన్ని వార్తలు