Womens T20 WC 2023: ఇండియా-పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఘోర తప్పిదం

13 Feb, 2023 13:28 IST|Sakshi

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2023లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన కీలక సమరంలో జరగరాని ఓ ఘోర తప్పిదం జరిగిపోయింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో యువ ఫీల్డ్‌ అంపైర్‌ లారెన్‌ అగెన్‌బ్యాగ్‌ ఓ ఘోర తప్పిదం చేసింది. పాక్‌ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించే క్రమంలో నిదా దార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో లారెన్‌ 6 కాకుండా 7 బంతులు వేయించింది.

ఏడవ బంతికి జెమీమా రోడ్రిగెస్‌ బౌండరీ బాదింది. దీని వల్ల టీమిండియాకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ, పాక్‌ మాత్రం తమకు నష్టం వాటిల్లిందని వాపోతుంది. భారత బ్యాటర్లు జెమీమా రోడ్రిగెస్‌ (38 బంతుల్లో 53 నాటౌట్‌), రిచా ఘోష్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌) మరో 6 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు. ఒకవేళ అదనంగా వేసిన ఏడవ బంతిని క్యాన్సిల్‌ చేసి, పరుగులు (ఫోర్‌) మైనస్‌ చేసినప్పటికీ టీమిండియా ఈజీగా విక్టరీ సాధించేది.

చేతిలో 7 వికెట్లు, క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లు అప్పటికే జోరుమీద ఉండటాన్ని బట్టి చూస్తే ఆఖరి ఓవర్‌ తొలి బంతికే టీమిండియా విజయం సాధించేది. ఏదిఏమైనప్పటికీ ఇలాంటి తప్పిదాలు జరగడం మాత్రం విచారకరం. చేయని తప్పుకు టీమిండియాను నిందించడం మాత్రం సరికాదు. పాక్‌ అభిమానులు విషయం తెలిసి కూడా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు.

ఏదో ఆఖరి బంతికి తాము ఓడామన్న రేంజ్‌లో వారు ఫీలవుతున్నారు. ఈ తప్పిదం జరగకపోయి ఉంటే తాము గెలిచే వాళ్లమని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ విషయంలో టీమిండియా ప్రమేయం ఏమీ లేనప్పటికీ మన సివంగులపై నోరు పారేసుకుంటున్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే దానికి టీమిండియాను బాధ్యుల్ని చేయడం సమంజసం కాదని భారత అభిమానులు అంటున్నారు. ఈ విషయంలో భారత జట్టుకు ఫ్యాన్స్‌ అండగా నిలుస్తున్నారు.

కాగా, టెక్నాలజీ, అనువణువు మానిటరింగ్‌ ఉన్న నేటి ఆధునిక క్రీడాయుగంలో ఇలాంటి ఘోర తప్పిదం జరగడం నిజంగా విచారకరమని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.     

మరిన్ని వార్తలు