T20 Cricket: టీమిండియాకు తొలి ఓటమి.. ఆస్ట్రేలియా ఘన విజయం

6 Feb, 2023 21:19 IST|Sakshi

ICC Womens T20 WC Warm Up Matches 2023: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు ఇవాల్టి (ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్‌ (32 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక (2 పరుగుల తేడాతో), మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్‌ (18 పరుగుల తేడాతో), నాలుగో మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా (44 పరుగులు), ఐదో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్‌ (6 వికెట్ల తేడాతో) విజయాలు సాధించాయి.

వార్మప్‌ మ్యాచే​ కదా అని తేలిగ్గా తీసుకున్న భారత్‌.. ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ జర్నీని ఓటమితో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. భారత బౌలర్లు శిఖా పాండే (3-0-9-2), పూజా వస్త్రాకర్‌ (3-0-16-2), రాధా యాదవ్‌ (3-0-22-2), గైక్వాడ్‌ (3-0-21-1) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (28), ఆష్లే గార్డనర్‌ (22) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో వేర్‌హామ్‌ (32 నాటౌట్‌), జొనాస్సెన్‌ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆసీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

అనంతరం 130 పరుగులు సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నిర్లక్ష్యంగా బ్యాటింగ్‌ చేసి 15 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్‌ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌ బౌలర్లలో డార్సీ బ్రౌన్‌ (3.1-0-17-4), ఆష్లే గార్డనర్‌ (3-0-16-2) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. కిమ్‌ గార్త్‌, ఎలైస్‌ పెర్రీ, జెస్‌ జొనాస్సెన్‌ తలో వికెట్‌ తీసి టీమిండియాకు ప్యాకప్‌ చెప్పారు. భారత ఆటగాళ్లు చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు.

భారత ఇన్నింగ్స్‌లో హర్లీన్‌ డియోల్‌ (12), దీప్తి శర్మ (19 నాటౌట్‌), అంజలీ శ్రావణి (15) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. భారత ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా పరుగులే (18) రెండో అత్యధికం కావడం విశేషం. భారత్‌ తమ తదుపరి వార్మప్‌ మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.   

మరిన్ని వార్తలు