T20 WC 2023 Ind Vs Aus: ప్రతీకార పోరుకు సై... ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆసీస్‌తో అమీతుమీ

23 Feb, 2023 02:45 IST|Sakshi

ఆస్ట్రేలియాతో భారత్‌ సెమీఫైనల్‌

సాయంత్రం గం. 6:30 నుంచి  ‘స్టార్‌ స్పోర్ట్స్‌’లో ప్రత్యక్ష ప్రసారం

ICC Womens T20 World Cup 2023: ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత మెగా ఈవెంట్‌ ఫైనల్లో మన ‘ప్రపంచకప్‌’ కలని కలగానే మిగిల్చింది. మళ్లీ బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ‘స్వర్ణ’వకాశాన్ని ఎగరేసుకు పోయింది. ఈ రెండు ఫైనల్స్‌లో ఓడిన భారత్‌ చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పుడు కంగారూ అమ్మాయిల్ని  తుదిపోరుకు చేరకుండా చేసే అవకాశం సెమీస్‌ మ్యాచ్‌ ద్వారా భారత్‌కు లభించింది.

హర్మన్‌ప్రీత్‌ సేన సమష్టిగా రాణించి ఆసీస్‌ను దెబ్బకొట్టాల్సిన తరుణం వచ్చేసింది.  నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియాను భారత్‌  ఓడించి ఫైనల్‌ పోరుకు అర్హత సాధిస్తుందా లేక మరోసారి ఓటమి మూటగట్టుకుంటుందా వేచి చూడాలి.
  
కేప్‌టౌన్‌: భారత అమ్మాయిల ఆట నాకౌట్‌కు చేరింది. ఇక్కడ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్‌ చేతికి అందుతుంది. ఇందులో మొదటి అడుగు వేసేందుకు భారత మహిళల జట్టు నేడు పటిష్టమైన డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది. ‘కంగారూ’ జట్టు భారత్‌కెపుడూ మింగుడు పడని ప్రత్యర్థే! గత ప్రపంచకప్‌లోనే కాదు... తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో ప్రవేశ పెట్టిన క్రికెట్‌లోనూ చాంపియన్‌ కాకుండా అడ్డుకుంది.

ఆఖరి పోరులో భారత్‌ను పరాజితగా నిలిపిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న హర్మన్‌ప్రీత్‌ సేనకు ఇదే సరైన సమయం. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటం, బౌలింగ్‌ నిలకడగా ఉండటం జట్టు అవకాశాల్ని మెరుగు పరుస్తోంది. అయితే ఆసీస్‌ ఆషామాషీ జట్టు కాదు. ఈ పొట్టి మెగా ఈవెంట్‌ ఏడుసార్లు జరిగితే ఇందులో ‘హ్యాట్రిక్‌’ సహా ఐదుసార్లు (2010, 2012, 2014, 2018, 2020) గెలిచిన గట్టి ప్రత్యర్థి  .

ఇలాంటి జట్టును ఓడించాలంటే ఒక్క ఫామ్‌ ఉంటే సరిపోదు! సర్వశక్తులు ఒడ్డితేనే అనుకున్న ఫలితం సాధించవచ్చు. కచ్చితంగా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తేనే భారత్‌ ఆఖరి పోరుకు అర్హత సాధిస్తుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా తప్పకుండా బ్యాట్‌కు పని చెప్పాల్సిందే. మిడిలార్డర్‌ను హర్మన్, రిచా ఘోష్‌ నడిపిస్తే పరుగులు వేగంగా సాధించవచ్చు. బౌలింగ్‌లో రేణుక సింగ్‌ పదును చూపెట్టాలి. శిఖా పాండే, దీప్తి శర్మలు కూడా రాణించాలి.  

అజేయంగా ఆ్రస్టేలియా 
ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయంగా సాగు తోంది. గ్రూప్‌–1లో ఎదురేలేని జట్టుగా నిలిచి సెమీస్‌ చేరింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి మెగా ఈవెంట్‌లో శుభారంభం చేసిన కంగారూ సేన ఇప్పటివరకు అన్నీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతోనే విజయాలు సాధించింది.

దక్షిణాఫ్రికాతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడని వికెట్‌ కీపర్‌ అలీసా హీలీ పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. టాపార్డర్‌లో అమెతో పాటు బెత్‌ మూనీ, కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ మెరుపులు మెరిపిస్తున్నారు. మిడిలార్డర్‌లో ఆష్లే గార్డ్‌నర్, ఎలీస్‌ పెర్రీ, గ్రేస్‌ హారిస్, తాలియా మెక్‌గ్రాత్‌లు కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటుతుండటంతో ఏడో వరుస వరకు బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ఢోకా లేదు. బౌలర్లలో మేగన్‌ షుట్, డార్సీ బ్రౌన్, అలానా కింగ్‌లు ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించగలరు. 


30 అంతర్జాతీయ టి20ల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు. ఇందులో భారత్‌ 6 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా 22 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌ ‘టై’కాగా... మరో మ్యాచ్‌ రద్దయింది. టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఈ రెండు జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లో భారత్, మూడు మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా విజయం సాధించాయి.   

తుది జట్లు (అంచనా) 
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌. రేణుక. 
ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌ (కెపె్టన్‌), బెత్‌ మూనీ, అలీసా హీలీ, ఎలీస్‌ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్‌ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్‌ షుట్, డార్సీ బ్రౌన్‌. 

మరిన్ని వార్తలు