T20 WC: టీ20 ప్రపంచకప్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కలకలం.. బంగ్లా క్రికెటర్‌తో

16 Feb, 2023 09:07 IST|Sakshi

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్‌ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను బుక్కీలు సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ ఈఎస్పీన్‌ క్రిక్‌ఈన్‌ఫో వెల్లడించింది. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తిరష్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేసినట్లు ఈఎస్పీన్‌ తన నివేదికలో పేర్కొంది.

అదే విధంగా ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణను బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ విడుదల చేసినట్లు  ఈఎస్పీన్‌ తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుక్కీలకు ఆమెకు మరో మరో బంగ్లా ప్లేయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ క‌ర‌ప్షన్‌ విభాగంకు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే మా క్రికెటర్లకు ఫిక్సర్లు సంప్రదిస్తే.. వారికి ఏమో చేయాలో బాగా తెలుసు. ఈవెంట్‌ ప్రోటోకాల్‌ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్‌కు తెలుసు.

ఇది బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుందని"ఈఎస్పీన్‌తో పేర్కొన్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు ‍మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్‌ ఓటమిపాలైంది.
చదవండి: T20 WC: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం

మరిన్ని వార్తలు