ICC Womens WC 2022: ‍పూజా వస్త్రాకర్‌.. నీ ఆటకు ఫిదా

6 Mar, 2022 14:02 IST|Sakshi

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా భోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్తాన్‌పై భారత మహిళల జట్టు తమకున్న రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 11 వన్డేలు ఆడి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. తాజాగా వన్డే ప్రపంచకప్‌ వేదికగా భారత్‌ పాక్‌పై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక కెప్టెన్‌గా మిథాలీరాజ్‌కు కూడా పాకిస్తాన్‌పై ఇది 11వ విజయం కావడం విశేషం. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన పూజా వస్త్రాకర్‌ ఆటకు అభిమానులు ఫిదా అయ్యారు.

మ్యాచ్‌ ఆరంభంలోనే షెఫాలీ వర్మ డకౌట్‌గా వెనుదిరగ్గా.. ఆ తర్వాత ఓపెనర్‌ మంధాన(52 పరుగులు), దీప్తి శర్మ(40 పరుగులు) రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇద్దరు ఒకేసారి ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్‌ మిథాలీతో పాటు మిగతా బ్యాట్స్‌మన్‌ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పూజా వస్త్రాకర్‌.. స్నేహా రాణాతో కలసి ఇన్నింగ్స్‌ ఆడింది.

ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు దాదాపు 122 పరుగులు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. పూజా వస్త్రాకర్‌(59 బంతుల్లో 67, 8 ఫోర్లు), స్నేహ రాణా(48 బంతుల్లో 53 నాటౌట్‌, 4 ఫోర్లు) పరుగులు సాధించారు. దీంతో టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ వుమెన్స్‌ను టీమిండియా బౌలర్లు కట్టడిచేశారు. రాజేశ్వరీ గైక్వాడ్‌ 4 వికెట్లతో రాణించడంతో పాకిస్తాన్‌ 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఇక టీమిండియా మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్‌ మార్చి 10న న్యూజిలాండ్‌తో ఆడనుంది.

మరిన్ని వార్తలు