Womens WC 2022: మిథాలీ రాజ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు .. ప్రపంచకప్‌ చరిత్రలో..!

27 Mar, 2022 14:08 IST|Sakshi

Mithali Raj: భారత మహిళా క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (84 బంతుల్లో 68; 8 ఫోర్లు) చేసిన ఆమె.. ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన భారత మహిళా బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించింది. 


యాదృచ్చికంగా ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత చిన్న వయసులో, ఇదే ప్రత్యర్ధిపై (దక్షిణాఫ్రికా) హాఫ్‌ సెంచరీ (2000 వన్డే ప్రపంచకప్‌లో) చేసిన భారత మహిళా బ్యాటర్‌ రికార్డు కూడా మిథాలీ పేరిటే నమోదై ఉంది. దీంతో ప్రపంచకప్‌ టోర్నీల్లో అతి చిన్న వయసులో, అతి పెద్ద వయసులో ఒకే ప్రత్యర్ధిపై హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌ రికార్డుల్లోకెక్కింది. 

ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53), మిథాలీ (68), హర్మాన్‌ప్రీత్‌ కౌర్‌ (48) రాణించంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఛేదనలో లారా వోల్వార్ట్‌ (80), లారా గూడాల్‌ (49), డుప్రీజ్‌ (51 నాటౌట్‌) రాణించడంతో సఫారీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఖరి బంతి వరకు పోరాడినప్పటికీ ఫలితంగా లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. 
చదవండి: IPL 2022: లేటు వయసులో లేటెస్ట్‌ రికార్డు నెలకొల్పిన ధోని
 

మరిన్ని వార్తలు