Womens World Boxing Championships: పసిడికి పంచ్‌ దూరంలో...

19 May, 2022 05:57 IST|Sakshi

ఫైనల్లో నిఖత్‌ జరీన్‌

మనీషా, పర్వీన్‌లకు కాంస్యాలు

న్యూఢిల్లీ: తన కెరీర్‌లో సీనియర్‌ విభాగంలో తొలిసారి ప్రపంచ చాంపియన్‌ కావడానికి భారత యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ విజయం దూరంలో నిలిచింది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఈ తెలంగాణ అమ్మాయి 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్‌ 5–0తో కరోలైన్‌ డి అల్మెదా (బ్రెజిల్‌)పై ఘనవిజయం సాధించింది.

మరోవైపు భారత్‌కే చెందిన మనీషా (57 కేజీలు), పర్వీన్‌ (63 కేజీలు) ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు. సెమీఫైనల్స్‌లో మనీషా 0–5తో ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో... పర్వీన్‌ 1–4తో అమీ సారా బ్రాడ్‌హర్ట్స్‌ (ఐర్లాండ్‌) చేతిలో ఓడిపోయారు.  కరోలైన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆద్యంతం దూకుడుగా ఆడిన నిఖత్‌ నిర్ణీత మూడు రౌండ్లలోనూ పైచేయి సాధించింది. నేడు జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిట్‌పోంగ్‌ జుటామస్‌తో నిఖత్‌ తలపడుతుంది. 2011లో టర్కీలోనే జరిగిన ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది.

సెమీఫైనల్లో బ్రెజిల్‌ బాక్సర్‌ను ఆమె సహజశైలిలో ఆడేందుకు అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో బరిలోకి దిగాను. స్వర్ణ పతకంతో స్వదేశానికి రావాలని పట్టుదలతో ఉన్నాను. నా ఫైనల్‌ ప్రత్యర్థి థాయ్‌లాండ్‌ బాక్సర్‌తో గతంలో ఒకసారి తలపడ్డాను. ఆమెను ఎలా ఓడించాలో హెడ్‌ కోచ్‌తో కలిసి వ్యూహం రచిస్తా.
–నిఖత్‌ జరీన్‌

మరిన్ని వార్తలు