అతను టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదు: అజహర్‌

1 Apr, 2021 16:48 IST|Sakshi

హైదరాబాద్: ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన భారత యువ బ్యాటింగ్‌ కెరటం రిషబ్‌ పంత్‌, సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌‌కు పూర్తిస్థాయి ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పంత్‌కు ఢిల్లీ కెప్టెన్సీ దక్కడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలో భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా చేరాడు. గతేడాది మంచి ఫామ్‌ను కనబర్చి ఫైనల్‌ దాకా వెళ్లిన ఢిల్లీ లాంటి యువ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయమేనని, ఆ బాధ్యతలను పంత్ సమర్ధవంతంగా నిర్వర్తిస్తాడని ఆయన కితాబునిచ్చాడు. 

పంత్‌.. గత కొద్ది మాసాలుగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నాడని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో అతని బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడని అజహర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. సమీప భవిష్యత్తులో పంత్‌.. టీమిండియా కెప్టెన్‌ రేసులో అందరికన్నా ముందుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడి దూకుడైన ఆటతీరు భవిష్యత్‌లో భారత్‌ను మరింత పటిష్ట స్థితికి చేరుస్తుందని అజ్జూ భాయ్ ట్వీట్‌ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమవ్వడం దురదృష్టకరమని, పంత్‌ తనకొచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకోగల సమర్ధుడని ఆయన కొనియాడాడు. 

కాగా, పంత్‌.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరుగులేని ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. తాజాగా ముగిసిన ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ అదే జోరును కనబరిచాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుస అర్ధశతకాలతో అలరించాడు. ఇదిలా ఉండగా, పంత్‌.. ఇదే ఫామ్‌ను ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆశిస్తోంది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌ ప్రారంభంకానుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబై వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో తలపడనుంది.
చదవండి: స‌చిన్ నీకు ప్ర‌త్య‌ర్థి ఏంటి.. అక్త‌ర్ ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం

మరిన్ని వార్తలు