World Athletics Championship: పతకంపై ఆశలు!

23 Jul, 2022 02:07 IST|Sakshi

జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ చోప్రా

రోహిత్‌ యాదవ్‌ కూడా

రేపు ఉదయం ఫైనల్స్‌

యుజీన్‌ (అమెరికా): 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు ఇప్పటివరకు ఒక్క పతకమే వచ్చింది. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ జరిగినా భారత్‌ ఖాతాలో మాత్రం మరో పతకం చేరలేదు. అంతా సవ్యంగా సాగితే ఆదివారం ఉదయం భారత్‌ ఖాతాలో ఈ మెగా ఈవెంట్‌ నుంచి మరో పతకం చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత ఆశాకిరణం, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ ఆశలను రేకెత్తిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్‌ దేశాన్ని ఊపేసిన నీరజ్‌ చోప్రా ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో తొలి అడ్డంకి దాటాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌లో నీరజ్‌ తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

ఫైనల్‌కు అర్హత సాధించాలంటే జావెలిన్‌ను 83.50 మీటర్ల దూరం విసరాలి లేదంటే ఓవరాల్‌గా టాప్‌–12లో నిలవాలి. అయితే నీరజ్‌ తొలి త్రోలోనే 83.50 మీటర్ల లక్ష్య దూరాన్ని అధిగమించాడు. 24 ఏళ్ల నీరజ్‌ ఈటెను 88.39 మీటర్ల దూరం విసిరి తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు అర్హత పొందాడు. ఓవరాల్‌గా అతని కెరీర్‌లో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 13 మంది పాల్గొన్న గ్రూప్‌ ‘ఎ’లో నీరజ్‌ అగ్రస్థానాన్ని... ఓవరాల్‌గా రెండో స్థానాన్ని అందుకున్నాడు.

గ్రూప్‌ ‘బి’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) 89.91 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. గ్రూప్‌ ‘బి’లో ఉన్న భారత్‌కే చెందిన రోహిత్‌ యాదవ్‌ జావెలిన్‌ను 80.42 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా 11వ స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది పోటీపడే జావెలిన్‌ త్రో ఫైనల్‌ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది.  

ట్రిపుల్‌ జంపర్‌ పాల్‌ సంచలనం
శుక్రవారం జరిగిన పురుషుల ట్రిపుల్‌ జంప్‌ క్వాలిఫయింగ్‌లో 25 ఏళ్ల ఎల్డోజ్‌ పాల్‌ 16.68 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్‌ ‘ఎ’లో ఆరో స్థానంలో, ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ట్రిపుల్‌ జంపర్‌గా గుర్తింపు పొందాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్‌ చిత్రావెల్‌ 17వ స్థానంలో, అబ్దుల్లా అబూబాకర్‌ 19వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు.  ట్రిపుల్‌ జంప్‌ ఫైనల్‌  భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు మొదలవుతుంది. సోనీ టెన్‌–2 చానెల్‌లో, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంది.

ఫైనల్లో నా 100 శాతం ప్రదర్శన ఇస్తా. ఏం జరుగుతుందో చూద్దాం.  ప్రతి రోజు వేరుగా ఉంటుంది. ఏ రోజు ఎవరు ఎంత దూరం విసురుతారో చెప్పలేం. ఫైనల్‌కు చేరిన 12 మందిలో ఐదారుగురు ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు.  
 – నీరజ్‌ చోప్రా

మరిన్ని వార్తలు