World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు

24 Jul, 2022 04:44 IST|Sakshi

మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ సంచలన ప్రదర్శన

50.68 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త ప్రపంచ రికార్డు

ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు లక్ష డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం

యుజీన్‌ (అమెరికా): రేసు మొదలైన వెంటనే ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్తూ... ఒక్కో హర్డిల్‌ను అలవోకగా అధిగమిస్తూ... ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెడుతూ... ఎవరూ ఊహించని సమయంలో లక్ష్యానికి చేరిన అమెరికా మహిళా అథ్లెట్‌ సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ తన పేరిట నాలుగోసారి ప్రపంచ రికార్డును లిఖించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో 22 ఏళ్ల సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది.

ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెమ్కే బోల్‌ (నెదర్లాండ్స్‌; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్‌ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం. మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్‌ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ కెల్సీ బార్బర్‌ (ఆస్ట్రేలియా; 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది.

మరిన్ని వార్తలు