World Blitz Chess: హంపి అద్భుతం

31 Dec, 2022 05:05 IST|Sakshi

ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో రజతం

నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌  

అల్మాటీ (కజకిస్తాన్‌): ఊహకందని ఆటతీరుతో అదరగొట్టిన భారత మహిళా చెస్‌ స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. నిర్ణీత 17 రౌండ్‌లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి రోజు గురువారం తొమ్మిది రౌండ్‌లు ముగిశాక హంపి 5 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉండటంతో ఆమెకు పతకం నెగ్గే అవకాశాలు లేవని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హంపి రెండో రోజు జరిగిన ఎనిమిది గేముల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు గేముల్లో గెలవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 44వ స్థానం నుంచి ఏకంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది.

13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్‌) విజేతగా నిలువగా... 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ. 24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్‌లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్‌ విభాగంలో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్‌ సాధించగా...     ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 12 పాయింట్లతో 42వ ర్యాంక్‌లో నిలిచారు.  

ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌
చరిత్రలో హంపి సాధించిన మొత్తం పతకాలు. ర్యాపిడ్‌ విభాగంలో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకం గెలిచింది. బ్లిట్జ్‌ విభాగంలో రజతం రూపంలో తొలిసారి పతకం సాధించింది.   

మరిన్ని వార్తలు