WC 2023: వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్‌ ఎక్కడంటే! హైదరాబాద్‌లోనూ..

22 Mar, 2023 10:40 IST|Sakshi

ICC ODI World Cup 2023- న్యూఢిల్లీ: పుష్కర కాలం తర్వాత భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి సంబంధించి తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా, గత వారం దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సమావేశంలో ఈ వివరాలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం అక్టోబర్‌ 5న ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది.

11 నగరాల్లో..
నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్‌ నిర్వహిస్తారు. 10 జట్లు టోర్నీలో పాల్గొంటుండగా, 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వేదికల విషయంలో అహ్మదాబాద్‌ కాకుండా మరో 11 నగరాలను బీసీసీఐ ప్రాథమికంగా ‘షార్ట్‌ లిస్ట్‌’ చేసింది.

హైదరాబాద్‌లోనూ..
ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్‌ ఈ జాబితాలో ఉన్నాయి. అక్టోబర్‌–నవంబర్‌ నెలలో భారత్‌లో ఉండే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌లు, వాటి వేదికల వివరాలకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు.

అయితే త్వరలోనే దీనిని వెల్లడిస్తామని ఐసీసీకి బోర్డు సమాచారమిచ్చింది. పాకిస్తాన్‌ జట్టుకు వీసా మంజూరు, భారత ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ అందించడం వంటి అంశాలపై కూడా బీసీసీఐ మరింత స్పష్టతనివ్వాల్సి ఉంది. 2011లో చివరిసారిగా భారత్‌లో వన్డే వరల్డ్‌ కప్‌ జరగ్గా... ఫైనల్లో శ్రీలంకను ఓడించి మన జట్టే విజేతగా నిలిచింది.    

చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలనం.. ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై!
Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌కు ఛాన్స్‌!

మరిన్ని వార్తలు