French Open 2022: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత స్వియాటెక్..

5 Jun, 2022 04:07 IST|Sakshi

రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌

టైటిల్‌ నెగ్గిన ఇగా స్వియాటెక్‌

ఈ ఏడాది వరుసగా 35వ విజయం

రూ. 18 కోట్ల 30 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

పారిస్‌: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెల్చుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌  68 నిమిషాల్లో 6–1, 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్, 18 ఏళ్ల కోకో గాఫ్‌ (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్‌ కోకో గాఫ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఈ ఏడాది స్వియాటెక్‌కిది వరుసగా 35వ విజయంకాగా... ఆమె ఖాతాలో ఆరో టైటిల్‌ చేరింది.  21 ఏళ్ల స్వియాటెక్‌ 2020లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరే క్రమంలో అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌ ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోలేదు. కానీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్వియాటెక్‌తో జరిగిన తుది పోరులో కోకో గాఫ్‌ ఒత్తిడిలో చేతులెత్తేసింది. ఆమె కేవలం నాలుగు గేమ్‌లు గెలిచింది. మరోవైపు స్వియాటెక్‌ పక్కా ప్రణాళికతో ఆడుతూ కోకోకు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు.

కచ్చితమైన సర్వీస్‌లకు తోడు శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో ఈ పోలాండ్‌ స్టార్‌ విజృంభించింది. సుదీర్ఘ ర్యాలీలకు ఏమాత్రం అవకాశమివ్వకుండా స్వియాటెక్‌ చాలాసార్లు పది ర్యాలీల్లోపే పాయింట్లు గెలుచుకుంది. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే గాఫ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన స్వియాటెక్‌ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదో గేమ్‌లో కోకో గాఫ్‌ తొలిసారి తన సర్వీస్‌ను కాపాడుకోగా... ఆరో గేమ్‌లో స్వియాటెక్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, ఏడో గేమ్‌లో గాఫ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తొలి సెట్‌ను 35 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కోకో కాస్త పోటీనిచ్చినా స్వియాటెక్‌ను ఓడించేందుకు అది సరిపోలేదు.


చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్‌ నాదల్‌: సచిన్‌, రవిశాస్త్రి ప్రశంసలు


 

మరిన్ని వార్తలు