World Rapid Chess Championship: తెలంగాణ యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ జైత్రయాత్ర

27 Dec, 2022 06:11 IST|Sakshi

‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ

అల్మాటీ (కజకిస్తాన్‌): తెలంగాణ యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో సత్తా చాటుకున్నాడు. ఓపెన్‌ కేటగిరీలో అతను ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

వీళ్లిద్దరు మొదటి నాలుగు గేముల్లో వారి ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఐదో గేమ్‌లో కార్ల్‌సన్‌తో తలపడిన అర్జున్‌ 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 38వ సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్, టాప్‌సీడ్‌ కార్ల్‌సన్‌ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు.

మొదటి నాలుగు గేముల్లో అర్జున్‌... సరాసి డెరిమ్‌ (కొసొవో), రౌనక్‌ (భారత్‌), వహప్‌ సనల్‌ (టర్కీ), రిచర్డ్‌ రపొర్ట్‌ (రొమేనియా)పై గెలుపొందాడు. సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ (2.5) రెండో రౌండ్లో ఫ్రెడెరిక్‌ (జర్మనీ)పై గెలిచి, మిగతా మూడు రౌండ్లలోనూ డ్రాలతోనే సరిపెట్టుకున్నాడు.

మహిళల ఈవెంట్‌లో సీనియర్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి (3.5) నాలుగు రౌండ్లలో మూడు విజయాలు సాధించింది. ఏడో సీడ్‌ హంపి ఎన్క్‌తూల్‌ అల్తాన్‌ (మంగోలియా), మరియమ్‌ (ఆర్మేనియా), గోంగ్‌ క్విన్‌యున్‌ (సింగపూర్‌)పై గెలుపొందింది. మరో నలుగురితో కలిసి ఆమె సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆరోసీడ్‌ ద్రోణవల్లి హారిక (2.5)తొలి గేమ్‌లో గెలిచి తర్వాతి మూడు గేముల్లోనూ డ్రా చేసుకుంది. 

మరిన్ని వార్తలు