హర్ష ‘హ్యాట్రిక్‌’ గెలుపు

27 Dec, 2021 05:15 IST|Sakshi

వార్సా (పోలాండ్‌): ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో తొలి రోజు హర్ష తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్‌ ఉన్న గ్రాండ్‌మాస్టర్లతో ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించాడు. మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం 2484 రేటింగ్‌ ఉన్న హర్ష తొలి గేమ్‌లో 51 ఎత్తుల్లో రవూఫ్‌ మమెదోవ్‌ (అజర్‌ బైజాన్‌–2690)పై... రెండో గేమ్‌లో 54 ఎత్తుల్లో వ్లాదిస్లావ్‌ కొవలెవ్‌ (రష్యా– 2647)పై... మూడో గేమ్‌లో 56 ఎత్తుల్లో ఒనిష్‌చుక్‌ (ఉక్రెయిన్‌ –2687)పై గెలుపొందాడు. తెలంగాణకే చెం దిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ రెండు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోనేరు హంపి తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని జైనాబ్‌ (అజర్‌బైజాన్‌)తో జరిగిన మూడో గేమ్‌లో ఓడిపోయింది. 

మరిన్ని వార్తలు