WTC- 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక మారింది! ఈసారి లార్డ్స్‌లో కాదు!

21 Sep, 2022 18:58 IST|Sakshi

World Test Championship 2023, 2025 Final Venues: ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌-2023 వేదిక మారింది. క్రికెట్‌ మక్కాగా పిలుచుకునే ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం ఈ మెగా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తొలుత ప్రకటించింది. అయితే, ఇప్పుడు వేదికను లార్డ్స్‌ నుంచి ది ఓవల్‌కు మార్చినట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఇక డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌ మాత్రం లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ విషయం గురించి ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జియోఫ్‌ అలార్డిస్‌ మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చారిత్రాత్మక ది ఓవల్‌లో నిర్వహించనున్నామని ప్రకటించడం సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

కాగా డబ్ల్యూటీసీ తొలి ఫైనల్‌ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ సేన విజయం సాధించింది. డబ్ల్యూటీసీ తొలి ట్రోఫీ గెలిచిన జట్టుగా కివీస్‌ చరిత్ర సృష్టించింది. 

ఇక డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 84 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్‌ కొనసాగుతున్నాయి. 

చదవండి: World Test Championship Final: శ్రీలంక కష్టమే! ఆసీస్‌ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌!

మరిన్ని వార్తలు